సంక్రాంతి పండగ వేళ కృష్ణా జిల్లాలో పెను ప్రమాదం తప్పింది. కృష్ణా జిల్లా నాగాయలంక వద్ద కృష్ణా నదిలో పడవ బోల్తా పడింది. అదృష్టవశాత్తుగా పడవలో ఉన్న ప్రయాణికులని స్థానికులు కాపాడటంతో పెను ప్రమాదం తప్పింది. తీరానికి కొద్ది దూరంలోనే ప్రమాదం జరగడం, వెంటనే తాము అప్రమత్తమై వారిని కాపాడటంతో పెను ప్రమాదం తప్పింది కానీ లేదంటే పండగ వేళ పెను విషాదం చోటుచేసుకునేదని స్థానికులు ఆందోళన వ్యక్తంచేశారు. ప్రయాణికులు సోమవారం ఎదురుమొండి దీవుల నుండి ఏటిమొగ వస్తుండగా ఈ ఘటన చోటు చేసుకుంది.
పడవలో 4 బైక్‌లు, ఇతర సామాగ్రి, ప్రయాణికులతో వెళ్తున్న కారణంగానే బోటు ఓవర్ లోడ్‌కి గురై బోల్తా పడినట్టు స్థానికులు తెలిపారు. ఎదురుమొండి దీవుల వద్ద నిత్యం ప్రయాణీకులను దాటించే పడవలని అధికారులు పోటీల కోసం తరలించడంతో గత్యంతరం లేని పరిస్థితుల్లోనే నాటు పడవలను ఆశ్రయించాల్సి వచ్చిందని బాధితులు ఆవేదన వ్యక్తంచేశారు. ఇటీవలే ఇబ్రహీంపట్నం వద్ద కృష్ణానదిలో భవానీ ద్వీపానికి వెళ్లి వస్తున్న బోటు ఓవర్ లోడ్‌తో బోల్తా పడిన దుర్ఘటనలో 21 మంది మృత్యువాత పడిన సంగతి తెలిసిందే.