అమరావతి: విశాఖ ఎయిర్ పోర్ట్ లో వైసీపీ అధినేత జగన్ పై జరిగిన దాడి ఘటనపై ఏపీ సీఎం చంద్రబాబు స్పందించారు. జగన్ పై దాడి నేపథ్యంలో అందుబాటులో మంత్రులతో ఏపీ సీఎం చంద్రబాబు సమావేశమయ్యారు. ఈ సందర్భంగా ఏపీలోని తాజా పరిణామాలపై మంత్రులతో చర్చించారు. ఈ సందర్భంగా జగన్ పై దాడిని చంద్రబాబుతో పాటు ఆయన మంత్రివర్గ సహచరులు ఖండించారు. ఈ సందర్భంగా చంద్రబాబు స్పందిస్తూ ఇలాంటి ఘటనలను ఎట్టిపరిస్థితుల్లోనూ ఉపేక్షించమన్నారు. ఈ దాడిలో టీడీపీ ప్రమేయం ఉందని వస్తున్న వార్తలను ఆయన ఖండించారు. ఈ ఘటనతో రాష్ట్ర ప్రభుత్వానికి ఎలాంటి సంబంధం లేదని వివరణ ఇచ్చారు. ఈ ఘటనను అడ్డుపెట్టుకుని రాష్ట్రంలో అల్లర్లకు దిగితే సహించే ప్రసక్తే లేదని చంద్రబాబు హెచ్చరించారు. ఈ క్రమంలో అప్రమత్తంగా ఉండాలని ఈ సందర్భంగా పోలీసులకు చంద్రబాబు ఆదేశాలు చేశారు.
దాడిపై హోం మంత్రి రియాక్షన్
జగన్ పై జరిగిన దాడిని తీవ్రంగా ఖండిస్తున్నామని ఏపీ హోం మంత్రి చినరాజప్ప పేర్కొన్నారు. విమానాశ్రయంలో వెయిటర్‌గా పనిచేస్తున్న శ్రీనివాసరావు అనే వ్యక్తి సెల్ఫీ తీసుకుంటానంటూ జగన్ వద్దకు వచ్చి దాడికి పాల్పడ్డాడని.. నిందితుడిని పోలీసులు అదుపులోకి తీసుకుని విచారిస్తున్నారని హోం మంత్రి వివరించారు. విచారణ అనంతరం నిందితులను కఠినంగా శిక్షిస్తామన్నారు.
మంత్రి నక్కా ఆనందబాబు రియాక్షన్
ఈ సందర్భంగా మంత్రి నక్కా ఆనంద్ బాబు మాట్లాడుతూ జగన్ దాడి విషయంలో టీడీపీ హస్తముందనడం సిగ్గుచేటు అని మండిపడ్డారు. ఆధారాలు లేకుండా తమపై తప్పుడు ఆరోపణలు తగవని హితవుపలికారు. ఇలాంటి చర్యలకు పాల్పడే నీచమైన చరిత్ర తమకు లేదన్నారు. తమ అధినేత, ముంఖ్యమంత్రి చంద్రబాబు రాజకీయ జీవితంలో ఇటువంటి దాడులను ఎప్పుడూ ప్రోత్సహించలేదని మంత్రి నక్కా వ్యాఖ్యానించారు.