Hero Vishal Reaction over Contesting in Kuppam: గత సార్వత్రిక ఎన్నికల్లో టీడీపీని చావుదెబ్బ కొట్టిన వైసీపీ వచ్చే ఎన్నికల్లో ఆ పార్టీని పూర్తిగా భూస్థాపితం చేయాలనే ఆలోచనలో ఉంది. రాష్ట్రంలోని 175 అసెంబ్లీ నియోజకవర్గాలకు గాను అన్నింటా వైసీపీ జెండా ఎగరాలని ఇటీవల ముఖ్యమంత్రి వైఎస్ జగన్ వైసీపీ నేతలకు దిశా నిర్దేశం చేశారు. టీడీపీని భూస్థాపితం చేయాలంటే ముందుగా కుప్పంలో చంద్రబాబును మట్టికరిపించాలనే ఆలోచనలో ఉన్నారు. మున్సిపల్ ఎన్నికల్లో కుప్పం కంచుకోటను బద్దలుకొట్టిన వైసీపీ.. సొంత ఇలాఖాలో చంద్రబాబును ఓడించడమే తమ తదుపరి టార్గెట్‌గా పావులు కదుపుతోంది. ఈ క్రమంలో కుప్పం వైసీపీ అభ్యర్థిగా తమిళ హీరో విశాల్ పేరు అనూహ్యంగా తెరపైకి వచ్చింది.
కుప్పంలో వైసీపీ తరుపున చంద్రబాబు నాయుడుపై విశాల్ పోటీ చేయబోతున్నట్లు కొద్దిరోజులుగా సోషల్ మీడియాలో విస్తృతంగా ప్రచారం జరుగుతోంది. తాజాగా ఈ ప్రచారంపై స్పందించిన హీరో విశాల్ అలాంటిదేమీ లేదని తేల్చేశారు. తాను కుప్పంలో పోటీ చేయబోతున్నట్లు జరుగుతున్న ప్రచారం అవాస్తవమని స్పష్టం చేశారు. తనపై వస్తున్న వదంతులను ఖండిస్తున్నానని.. రాజకీయంగా ఇప్పటివరకూ తననెవరూ సంప్రదించలేదని తెలిపారు. అసలు ఇలాంటి వార్తలు ఎలా పుట్టుకొస్తాయో అంటూ అసంతృప్తి వ్యక్తం చేశారు. ప్రస్తుతం సినిమాలతో బిజీగా గడుపుతున్నానని.. ఏపీ రాజకీయాల్లోకి వచ్చే ఆలోచన గానీ, చంద్రబాబుపై పోటీ చేసే ఉద్దేశం గానీ తనకు లేవని వెల్లడించారు.
స్వయంగా విశాల్ చేసిన ఈ ప్రకటనతో కుప్పంలో ఆయన పోటీపై వినిపిస్తున్న ఊహాగానాలకు తెరపడినట్లయింది. మంత్రి పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి కూడా ఇదివరకే ఈ విషయంపై క్లారిటీ ఇచ్చారు. కుప్పం నుంచి విశాల్ పోటీ చేయబోతున్నట్లు జరుగుతున్న ప్రచారం కేవలం ఎల్లో మీడియా సృష్టి అని ఆరోపించారు. కుప్పం బరిలో వైసీపీ తరుపున పోటీ చేయబోయేది ఎమ్మెల్సీ భరత్ అని స్పష్టం చేశారు. ప్రస్తుతం భరత్ వైసీపీ కుప్పం ఇన్చార్జిగా ఉన్నారు. గతంలో ఇదే కుప్పంలో చంద్రబాబుపై భరత్ తండ్రి చంద్రమౌళి వరుసగా రెండుసార్లు పోటీ చేసి ఓడిపోయారు. రెండేళ్ల క్రితం ఆయన మరణంతో పాలిటిక్స్‌లో భరత్ యాక్టివ్ అయ్యారు. ఎమ్మెల్సీ ఇచ్చాక నియోజకవర్గంలో మరింత దూకుడు పెంచారు. కుప్పంలో చంద్రబాబుపై విజయం విషయంలో ధీమాగా ఉన్న భరత్ వైసీపీ నమ్మకాన్ని నిలబడుతాడో లేదో భవిష్యత్‌లో తేలనుంది.
Also Read: Flexi War: హైదరాబాద్‌లో ఫ్లెక్సీల రచ్చ.. పోలీసులకు పార్టీల ఫిర్యాదులు! ఇవాళ ఏం జరుగుతుందో?
స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee హిందుస్థాన్ యాప్ డౌన్లోడ్ చేసుకోండి
Android Link - https://bit.ly/3hDyh4G
Apple Link - https://apple.co/3loQYe
మా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి.Twitter , Facebook