TDP-Janasena Manifest Highlights: ఆంధ్రప్రదేశ్‌లో అధికారమే లక్ష్యంగా జతకట్టిన తెలుగుదేశం, బీజేపీ, జనసేన పార్టీ కూటమి తమ మేనిఫెస్టోను ప్రకటించింది. ఇప్పటికే సూపర్ సిక్స్ టీడీపీ మేనిఫెస్టో విడుదల చేయగా.. వాటిని జోడించి సరికొత్తగా మేనిఫెస్టోను రూపొందించారు. రాష్ట్ర ప్రజల నేటి అవసరాలు తీరుస్తాం.. రేపటి ఆకాంక్షలను సాకారం చేస్తాం అనే లక్ష్యంగా కూటమి తమ మేనిఫెస్టోను రూపొందించింది. ఉండవల్లిలోని తన నివాసంలో చంద్రబాబు నాయుడు, పవన్ కల్యాణ్ మేనిఫెస్టోను మంగళవారం విడుదల చేశారు. తెలుగుదేశం పార్టీ సూపర్ 6, జనసేన షణ్ముఖ వ్యూహం అంశాలతో పాటుగా అన్ని వర్గాలకు సంక్షేమం కల్పించే అంశాలు మ్యానిఫెస్టోలో పెట్టామని పవన్ కళ్యాణ్ అన్నారు. యువ గళం ద్వారా తెలుగుదేశం పార్టీ వారికి వచ్చిన విజ్ఞప్తులు, జన వాణి ద్వారా తమకు వచ్చిన విజ్ఞప్తుల ఆధారంగా మ్యానిఫెస్టోలో అంశాలను పొందుపరిచామన్నారు.
సముద్ర వేట విరామ సమయంలో మత్స్యకారులకు 20 వేల ఆర్థిక సాయం, 217 జీవో రద్దు, సాంకేతిక సహకారం అందిస్తామన్నారు. యువతకు క్రీడల్లో ప్రోత్సాహం కల్పించేలా ప్రోత్సాహక చర్యలు చేపడతామని చెప్పారు. బీసీ డిక్లరేషన్ అమలు చేస్తాం, వారి కోసం నిధులు ఖర్చుపెడతామన్నారు. పెన్షన్లు రూ.4 వేలకు పెంపు, ఏడాదికి 3 ఉచిత గ్యాస్ సిలిండర్లు, మహిళలకు ఉచిత ఆర్టీసీ ప్రయాణం కల్పిస్తామన్నారు. బీసీలకు స్థానిక సంస్థల్లో వైసీపీ ప్రభుత్వం రద్దు చేసిన 34 నుంచి 24 శాతానికి తగ్గించిన రిజర్వేషన్లు, మళ్లీ 34 శాతానికి పెంచుతామన్నారు. చేతి వృత్తులు పని చేసుకునే వారికి 5 వేల కోట్ల నిధి కేటాయించి.. నూతన పనిముట్లు అందేలా చూస్తామన్నారు. చేనేత వర్గాలకు అండగా ఉంటామని.. పవర్ లూమ్ వారికి 500 యూనిట్లు, హ్యాండ్లూమ్ వారికి 200 యూనిట్లు ఉచిత విద్యుత్ అందిస్తామన హామీ ఇచ్చారు. నాయీ బ్రాహ్మణులకు 200 యూనిట్ల ఉచిత విద్యుత్ వారి షాపులకు అందిస్తామని ప్రకటించారు.
ఆడబిడ్డ నిధి కింద 18 ఏళ్లు నిండిన ప్రతి మహిళకు నెలకు రూ.1,500 చొప్పున ఏడాదికి రూ.18 వేలు అందజేస్తామని పవన్ కళ్యాణ్ తెలిపారు. నిరుద్యోగ యువతకు నెలకు రూ.3 వేల చొప్పున భృతి అందజేస్తామన్నారు. ప్రతి ఇంటికీ ఉచిత కుళాయి కనెక్షన్, స్వచ్ఛమైన తాగునీటి సరఫరా చేస్తామన్నారు. ‘తల్లికి వందనం' కింద చదువుకుంటున్న పిల్లలకు ఒక్కొక్కరికి ఏడాదికి రూ.15 వేల చొప్పున ఆర్థిక సాయం అందజేస్తామన్నారు.
అనంతరం చంద్రబాబు నాయుడు మాట్లాడుతూ.. ఇది టీడీపీ-జనసేన మేనిఫెస్టో అని తెలిపారు. జాతీయ పార్టీలకు స్థానిక హామీలతో సంబంధం ఉండదని.. తమ మేనిఫెస్టోకు బీజేపీ మద్దతు ఉంటుందన్నారు. అధికారంలోకి రాగానే తొలి సంతకం మెగా డీఎస్సీపై పెడతామని హామీ ఇచ్చారు. 10 లక్షల వరకూ మహిళలకు వడ్డీ లేని రుణాలు ఇస్తామన్నారు. అన్నా క్యాంటీన్లను పునరుద్దరిస్తామన్నారు. సీపీఎస్‌పై సమీక్ష చేస్తామని.. వాలంటీర్లకు జీతాలు పది వేలకు పెంచుతామని ప్రకటించారు. జగన్ ల్యాండ్ గ్యాబ్రింగ్ యాక్ఠ్ను రద్దు చేస్తామని హామీ ఇచ్చారు.
"జగన్ అధికారంలోకి వచ్చాక కాకినాడ పోర్ట్, సెజ్, గంగవరం పోర్టు, సినిమా స్టూడియోలు, గెలాక్సీ గ్రానైట్ కంపెనీ ఎందుకు చేతులు మారాయి..? బలవంతంగా బెదిరించి ప్రజల ఆస్తులు నచ్చిన వారి పేరుమీద రాయించుకుంటున్నాయి. చంద్రన్న బీమా ద్వారా ఇన్స్యూరెన్స్ అందిస్తాం. సహజ మరణానికి 5 లక్షలు, ప్రమాదంలో మరణిస్తే 10 లక్షల ఇన్స్యూరెన్స్ అందిస్తాం.. జీవో 51 రద్దు చేసి చలాన్ల తగ్గింపు, గ్రీన్ ట్యాక్స్ తగ్గింపు చేస్తాం. పోలవరం పూర్తి చేస్తాం, నదులు అనుసంధానం చేస్తాం, పెండింగ్ ప్రాజెక్టులు అన్ని పూర్తి చేస్తాం, జగన్ హయంలో ఇరిగేషన్ శాఖ అడ్వాన్న స్థితికి చేరుకుంది.
బీపీ, షుగర్ ఉన్న వారికి జనరిక్ మందులు ఉచితంగా ఇస్తాం. ఉచిత ఇసుక విధానాన్ని తీసుకొస్తాం. డ్రగ్స్, గంజాయిని తరిమేస్తాం. అమరావతిని రాజధానిగా కొనసాగిస్తాం. బ్రాహ్మణ కార్పొరేషన్ ను ఇంకా అభివృద్ధి చేస్తాం. రాయలసీమను అన్ని రంగాల్లో అభివృద్ధి చేస్తాం. జర్నలిస్టులకు ఇళ్ల స్థలాలు ఇస్తాం. జర్నలిస్టులకు అక్రిడిటేషన్ కార్డులు ఇస్తాం." అని చంద్రబాబు నాయుడు అన్నారు.