YS Sharmila vs YS Jagan: ఆంధ్రప్రదేశ్ అసెంబ్లీ ఎన్నికల ఫలితాలు దేశాన్నే నివ్వెరపరిచాయి. ఐదేళ్ల వైఎస్ జగన్ పరిపాలనను ప్రజలు నిర్ద్వందంగా తిరస్కరించారు. చరిత్రలో ఏ ముఖ్యమంత్రి చవిచూడని ఘోర పరాభవం జగన్ ఎదుర్కోవాల్సి వచ్చింది. జగన్ ఈ స్థాయిలో ఓటమి చెందడానికి కారణాలు చాలా ఉన్నాయి. వాటిలో అతడి సోదరి వైఎస్ షర్మిల కూడా ఉన్నారు. 2019 ఎన్నికల్లో జగన్‌కు అధికారం దక్కడంలో కీలక భూమిక పోషించిన అదే షర్మిల ఇప్పుడు అన్న ఓడడంలోనూ అదే పాత్రను పోషించారు. రాజకీయాల్లో శిఖండి పాత్రను షర్మిల పోషించినట్లు విశ్లేషకులు చెబుతున్నారు.
Also Read: Revanth, KCR Wishes: చంద్రబాబుకు శిష్యుడు రేవంత్ రెడ్డి శుభాకాంక్షలు.. కేసీఆర్‌తో సహా
తాజాగా జరిగిన ఆంధ్రప్రదేశ్ ఎన్నికల ఫలితాలు.. 2019 ఎన్నికలను పోల్చి చూస్తే పూర్తి విరుద్ధంగా ఉన్నాయి. ఫలితాలు అటు ఇటు తారుమారయ్యాయి. అయితే ఆ ఎన్నికల్లో వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ విజయ దుంధుబి మోగించడానికి చాలా పరిస్థితులు కలిసివచ్చాయి. నాటి చంద్రబాబు ప్రభుత్వం అవినీతి, దుర్మార్గ పాలనపై ప్రజలు విసుగెత్తడం, జగన్ సుదీర్ఘ పాదయాత్రతో పాటు చాలా కారణాలు ఉన్నాయి. వాటిలో వైఎస్ షర్మిల ప్రచారం కూడా ఒకటి. రాష్ట్ర విభజన అనంతరం వైఎస్ జగన్‌కు కష్టమొచ్చిన ప్రతిసారి ఆయన సోదరి షర్మిల రంగంలోకి దిగేవారు.
అది పాదయాత్ర అయినా.. ఎన్నికల సభలు అయినా.. పార్టీ కార్యకలాపాలయినా ఏవైనా షర్మిల తన భుజాల మీద మోసి వైఎస్సార్‌సీపీ బలోపేతానికి దోహదం చేశారు. 2019 ఎన్నికల సమయంలో 'బై బై బాబు.. బై బై పప్పు కూడా' అంటూ నవ్వుకుంటూ షర్మిల చేసిన ప్రచారం వైఎస్సార్‌సీపీకి ఒక ఊపు తీసుకొచ్చింది. జగన్ కన్నా మరింత చురుగ్గా షర్మిల ప్రచారం చేశారు. ఆ ఎన్నికల్లో వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ 151 సీట్లు కొల్లగొట్టడానికి షర్మిల ప్రధాన కారణంగా చెప్పవచ్చు. షర్మిల ప్రచారంతోనే టీడీపీ 23 స్థానాలకు పరిమితమైంది.
గెలుపులో అంతటి కీలక పాత్ర పోషించిన షర్మిల ఇప్పుడు జగనన్న ఓటమిలోనూ అదే స్థాయి పాత్ర పోషించారు. అధికారంలోకి వచ్చాక అన్నతో షర్మిలకు పొసగలేదు. దీంతే విబేధించి ఆమె తెలంగాణ రాజకీయాల్లోకి వచ్చారు. రెండేండ్ల అనంతరం అనూహ్యంగా ఏపీ రాజకీయాల్లోకి ప్రవేశించి ఏకంగా అన్నను జైలుకు పంపిన కాంగ్రెస్ పార్టీతో షర్మిల చేతులు కలిపారు. రాష్ట్ర విభజనకు కారణమైన కాంగ్రెస్‌లో చేరి అధ్యక్షురాలిగా మారారు.
అయితే జగన్‌పై కక్ష సాధింపు చర్యల్లో భాగంగా ఆమె ఏపీ రాజకీయాల్లోకి ప్రవేశించారని అప్పట్లో చర్చ జరిగింది. అందులో భాగంగానే తన బాబాయ్ వైఎస్ వివేకానంద రెడ్డి హత్యను పట్టుకుని షర్మిల ప్రచారంలో పాల్గొన్నారు. అంతేకాకుండా తన కుటుంబ విషయాలు, వైఎస్ జగన్ చేసిన తప్పిదాలను అన్నింటిని షర్మిల ప్రజల ముందు ఉంచారు. జగన్ సోదరుడు వైఎస్ అవినాశ్ రెడ్డి ఓటమి లక్ష్యంగా షర్మిల కడప లోక్‌సభ బరిలో నిలిచారు.
అంతేకాకుండా రాష్ట్రంలో షర్మిల సుడిగాలి పర్యటనలు చేశారు. జగన్‌పై నేరుగా విమర్శలు చేస్తూ షర్మిల ప్రజల్లో సరికొత్త చర్చను తెరపైకి తీసుకొచ్చారు. జగన్ పాలన తప్పిదాలను లేవనెత్తడంతో ప్రజల్లో ఆలోచనలు రేకెత్తాయి. టీడీపీ, జనసేన పార్టీలు చేస్తున్న విమర్శలకన్నా షర్మిల విమర్శలు హాట్ టాపిక్‌గా మారాయి. దీంతో జగన్ పాలనపై కొన్ని వర్గాల్లో వ్యతిరేకత ప్రారంభమైంది. ఆ ప్రభావం జగన్ ఓటమిలో కీలకంగా ఉంది. ముఖ్యంగా రాయలసీమ ప్రాంతంలో తీవ్రంగా కనిపించింది. సొంత జిల్లా కడపలో వైసీపీ అతి తక్కువ సీట్లు పొందడానికి షర్మిల కూడా ఒక కారణంగా చెప్పవచ్చు.
ఏపీ ఎన్నికల్లో జగన్ ఓటమిలో షర్మిల కూడా కీలక పాత్ర పోషించారని విశ్లేషకులు చెబుతున్నారు. నాడు అన్న విజయంలో కీలక పాత్ర పోషించిన షర్మిల.. ఇప్పుడు అన్న భారీ ఓటమిలోనూ ఆమె పాత్ర ఉందని చర్చ జరుగుతోంది. కుటుంబంలో చెలరేగిన వివాదం ఏకంగా రాజకీయాలు పూర్తిగా మారిపోయాయి. అన్నాచెల్లెళ్ల మధ్య ఏం జరిగిందో తెలియదు కానీ రాజకీయంగా మాత్రం అన్నాచెల్లెలు బద్ధ శత్రువులయ్యారు. ఇప్పుడు ఓటమితో జగన్ ఒంటరి కావడంతో వచ్చే ఎన్నికల వరకు షర్మిల అన్నకు అండగా నిలవాలని జగన్, వైఎస్ కుటుంబ అభిమానులు భావిస్తున్నారు.
స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.
ఆండ్రాయిడ్ లింక్ - https://bit.ly/3P3R74U
ఆపిల్ లింక్ - https://apple.co/3loQYe
సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండిFacebook, Twitter