Ys Jagan Strong Warning: వైసీపీ మాజీ ఎమ్మెల్యే వల్లభనేని వంశీని జైళ్లో ములాఖాత్ అనంతరం వైసీపీ అధినేత వైఎస్ జగన్ మీడియాతో మాట్లాడారు. రాష్ట్రంలో దిగజారిన శాంతి భద్రతలకు వల్లభనేని వంశీ అరెస్టు అద్దం పడుతోందన్నారు. రాష్ట్ర ప్రభుత్వం పూర్తిగా కక్ష రాజకీయాలకు పాల్పడుతోందని మండిపడ్డారు.
విజయవాడ జైళ్లో ఉన్న గన్నవరం మాజీ ఎమ్మెల్యే, వైసీపీ నేత వల్లభనేని వంశీని వైసీపీ అధినేత వైఎస్ జగన్ పరామర్శించారు. అనంతరం మీడియాతో మాట్లాడుతూ నిప్పులు చెరిగారు. జగన్ 2.0 అంటే ఏంటో చూపించారు. ఎలాంటి కేసు లేకపోయినా, కేవలం కక్ష పూరితంగా వంశీని అరెస్టు చేశారని మండిపడ్డారు. టీడీపీ నేత పట్టాభిని చంద్రబాబే పంపించి దాడి జరిగేలా ఉసిగొల్పారని జగన్ దుయ్యబట్టారు. గన్నవరం టీడీపీ కార్యాలయంపై దాడి కేసులో కూడా వంశీపై తప్పుడు కేసులు పెట్టారన్నారు. బెయిల్ రాకూడదనే ఆలోచనతో నాన్ బెయిలబుల్ కేసులు పెట్టారన్నారు. ఇదే విధంగా రాష్ట్రంలో 44 మంది వైసీపీ నేతలపై అక్రమ కేసులు పెట్టారని మండిపడ్డారు.
రాష్ట్రంలో కూటమి ప్రభుత్వం అధికారంలో వచ్చినప్పటి నుంచి అడుగడుగునా ప్రజాస్వామ్యం ఖూనీ అవుతోందని విమర్శించారు. పిడుగురాళ్లలో 33 కార్పొరేటర్లు ఉండి వైసీపీ గెలిచినా తాము గెలిచామని టీడీపీ ప్రకటించుకున్న అంశాన్ని ప్రస్తావించారు. తునిలో కూడా అదే చేశారన్నారు. పోలీసులు కూడా ఇష్టారాజ్యంగా వ్యవహరిస్తూ అక్రమ కేసులు పెడుతున్నారన్నారు.
ఈ సందర్భంగా అధికారులు, పోలీసులకు జగన్ గట్టి హెచ్చరిక జారీ చేశారు. కూటమి ప్రభుత్వం చేస్తున్న అన్యాయంలో భాగం కావద్దని..టోపీలపై ఉన్న సింహాలకు సెల్యూట్ చేయమని సూచించారు. అన్యాయం చేసిన అధికారులు, నేతల్ని బట్టలూడదీసి నిలబెడతామని హెచ్చరించారు. రిటైర్ అయినా లేక సప్త సముద్రాల ఆవల ఉన్నా వదిలిపెట్టే సమస్య లేదన్నారు. అందర్నీ చట్టం ముందు నిలబెడతామన్నారు. అధికారులు, పోలీసులు ఇప్పటికైనా మారమని సంకేతాలు పంపించారు.
Also read: GBS Disease: ఏపీని వెంటాడుతున్న జీబీఎస్ వ్యాధి, చికిత్స అంత ఖరీదైందా
స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్లోడ్ చేసుకోండి.
ఆండ్రాయిడ్ లింక్ - https://bit.ly/3P3R74U
ఆపిల్ లింక్ - https://apple.co/3loQYe
Twitter, Facebook సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి