ఢిల్లీ అసెంబ్లీ ఎన్నికల్లో వరుసగా రెండో పర్యాయం అరవింద్ కేజ్రీవాల్ ఘన విజయాన్ని సొంతం చేసుకున్నారు. గత ఐదేళ్లుగా ప్రజలకు తాము చేసిన పనులే విజయాన్ని అందించాయని ఆమ్ ఆద్మీ పార్టీ (ఆప్) నేతలు చెబుతుంటే.. బీజేపీ జమ్మూకాశ్మీర్ అధ్యక్షుడు రవీందర్ రైనా వింత వాదనను తెరమీదకి తెచ్చారు. ఆప్ విజయంలో హనుమాన్ చాలీసా కీలకపాత్ర పోషించిందంటూ ఆసక్తికరవ్యాఖ్యలు చేశారు. కేజ్రీవాల్ హనుమాన్ చలిసా పఠించడం వల్లే ఢిల్లీ అసెంబ్లీ ఎన్నికల్లో ఆప్ ఘన విజయం సాధించిందని రవీందర్ అభిప్రాయపడ్డారు.
ఎన్నికల ఫలితాల కథనాల కోసం క్లిక్ చేయండి
ఆప్ విజయంపై రవీందర్ రైనా జమ్మూలో మీడియాతో మాట్లాడారు. హనుమంతుడి ఆశీర్వాదం వల్లే కేజ్రీవాల్ విజయం సాధించాడని, లేకపోతే పరిస్థితి మరోలా ఉండేదన్నారు. ఈ ఎన్నికల్లో విజయం సాధించినా బీజేపీ ఓట్ల శాతం పెరిగిందని చెప్పారు. హనుమంతుడ్ని ప్రార్థించిన కారణంగానే కేజ్రీవాల్‌కు విజయకేతనం ఎగరవేశాడని తాను విశ్వసిస్తున్నట్లు చెప్పారు. నిత్యం ‘జై శ్రీ రామ్’ అని నినాదాలు చేసినప్పటికీ బీజేపీ ఎందుకు గెలవలేదని అడిగిన ప్రశ్నకు సమాధానమిచ్చారు. ఆ నినాదాలు చేసిన కారణంగానే బీజేపీ లోక్‌సభ ఎన్నికల్లో భారీ విజయాన్ని అందుకుందని బదులిచ్చారు.
Also Read: బీజేపీ 6 సీట్లు.. ఆప్ 1.. ఇలా కలిసొచ్చిందా?
కాగా, ఢిల్లీ సీఎం అరవింద్ కేజ్రీవాల్ ఓట్ల లెక్కింపు జరిగిన మంగళవారం కన్నాట్ ప్లేస్ సమీపంలో ఉన్న హునుమాన్ ఆలయాన్ని దర్శించుకున్నారు. ఆలయం నుంచి నేరుగా ఓట్ల లెక్కింపు కేంద్రానికి వెళ్లి న్యూఢిల్లీ అసెంబ్లీ సీటు నుంచి తాను గెలుపొందిన పత్రాన్ని కేజ్రీవాల్ అందుకునేందుకు వెళ్తారని ప్రచారం జరిగింది.