రాంచీ: ఝార్ఖండ్ పర్యటనలో కేంద్ర హోం మంత్రి అమిత్ షా కీలక ప్రకటన చేశారు. అసోంకు మాత్రమే పరిమితమైన జాతీయ పౌర జాబితా ( ఎన్ఆర్‌సీ ) దేశమంతటా అమలు చేస్తామని కేంద్ర హోం మంత్రి అమిత్ షా ప్రకటించారు. . అక్రమ వసల దారులను దేశం నుంచి తరిమివేసేందుకు ఇది దోహదపడుతుందన్నారు. ఝార్ఖండ్ పర్యటనలో ఉన్న అమిత్ షా ఈ ప్రకటన చేశారు.
దేశంలో అక్రమంగా నివసిస్తున్న వారిని గుర్తించడానికి జాతీయ పౌరపట్టిక కచ్చితంగా అమలు చేయాల్సిన అవసరం ఉందని అమిత్ షా అభిప్రాయపడ్డారు. ఎవరైనా అక్రమంగా అమెరికా, బ్రిటన్ లాంటి దేశాలకు వెళ్లి నివసించగలరా? ... అలాంటప్పుడు భారత్‌లో మాత్రమే సరైన ధ్రువీకరణ పత్రాలు లేకుండా ఎలా ఉండగలరు?. అందుకే జాతీయ పౌర పట్టికను దేశ వ్యాప్తంగా అమలు చేయాలనేది తమ ఉద్దేశమన్నారు.
గత ఎన్నికల్లో ఎన్నికల మేనిఫెస్టో ఎన్ఆర్‌సీ అంశాన్ని పొందుపరిచామని పేర్కొన్నారు. తాను నిర్వహించిన ప్రతి ఎన్నికల ర్యాలీలో ఇదే విషయాన్ని ప్రస్తావించానని తెలిపారు. తమ విధానం నచ్చడంతోనే 2019 ఎన్నికల్లో ప్రజలు బీజేపీకి బ్రహ్మరథం పట్టారని తెలిపారు. ఎన్ఆర్సీ అంటే అసోం పౌర పట్టిక కాదు. జాతీయ పౌర పట్టిక అని అలాంటప్పుడు ఎన్ఆర్‌సీ ఒక్క అసోంకు మాత్రమే ఎందుకు అమలు చేయాలి..ఇది దేశ వ్యాప్తంగా ఎందుకు అమలు చేయకూడదని అమిత్ షా ప్రశ్నించారు