శాస్త్రవేత్తలు గత నెల 29న ప్రయోగించిన జీశాట్-6 ఏ శాటిలైట్‌కు భారత అంతరిక్ష పరిశోధనా సంస్థ (ఇస్రో)తో సంబంధాలు తెగిపోయాయి. గత గురువారం లాంచ్ చేసిన అత్యంత శక్తివంతమైన జీశాట్-6 ఏ శాటిలైట్‌తో సంబంధాలు తెగిపోయినట్లు ఇస్రో ధృవీకరించింది. అయితే త్వరలోనే సంబంధాలను పునరుద్ధరిస్తామని శాస్త్రవేత్తలు చెబుతున్నారు. జీశాట్-6 ఏ, భారతదేశం యొక్క తాజా సమాచార ఉపగ్రహం. దీన్ని విజయవంతంగా గురువారం కక్ష్యలోకి పంపించారు. సుదూర ప్రాంతాల్లోని సైనిక దళ సిబ్బందికి మొబైల్ పరికరాలపై అధిక-వేగవంతమైన ఇంటర్నెట్ సదుపాయం కల్పించడంతో ఈ ఉపగ్రహాన్ని ప్రారంభించారు.
"విజయవంతమైన జీశాట్-6 ఏను చివరి కక్ష్యలో ప్రవేశపెట్టే సమయంలో సంబంధాలు తెగిపోయాయి. ఏదైనా శాటిలైట్‌ను లాంచ్ చేసినప్పుడు దానిని కొంతకాలం వరకు భూమికి దగ్గరగా ఉంచుతారు. ఆ తర్వాత దానిని తుది కక్ష్యలో ప్రవేశపెడతారు. జీశాట్-6ఏ విషయంలోనూ తొలి రెండు దశలు ఫలితానిచ్చాయి. కానీ చివరి దశ కక్ష్యలోకి ప్రవేశపెట్టే సమయంలో శాటిలైట్‌తో కమ్యూనికేషన్ తెగిపోయింది. ఆ శాటిలైట్‌తో మళ్లీ సంబంధాలు పునరుద్ధరించడానికి ఇస్రో శాస్త్రవేత్తలు ప్రయత్నిస్తున్నారు. "అని ఇస్రో ఒక ప్రకటనలో తెలిపింది.
2066 టన్నుల జీశాట్-6ఏ ఉపగ్రహాన్ని రూ.270 కోట్ల ఖర్చుతో రూపొందించారు. జీఎస్ఎల్వీ రాకెట్ ద్వారా దీనిని అంతరిక్షంలోకి పంపించారు. దేశంలోని మారుమూల ప్రాంతాల్లో మోహరించిన భద్రతా బలగాల దగ్గర ఉండే హ్యాండ్ డివైస్‌లకు ఈ శాటిలైట్ సమాచారాన్ని పంపించేలా లేదా పొందేలా రూపొందించారు. అయితే ఇప్పుడా శాటిలైట్‌తో లింక్ తెగడానికి కచ్చితమైన కారణమేంటన్నది మాత్రం ఇంకా తెలియలేదు.
ఈ శాటిలైట్ ఇస్రో తయారుచేసిన అతిపెద్ద ఆంటెనాను కలిగి ఉంది. ఆంటెనా యొక్క వ్యాసం 6 మీటర్లు. ఇది దాని కక్ష్యకు చేరినప్పుడు ఒక గొడుగులా తెరవబడుతుంది. దీనివల్ల భద్రతా బలగాలకు డేటా ట్రాన్స్ఫర్ సులువవుతుంది.
జీశాట్-6ఏ కమ్యూనికేషన్ ఉపగ్రహ ప్రయోగం విజయవంతం అయినందుకు ప్రధాన మంత్రి నరేంద్ర మోదీ ఇస్రో శాస్త్రవేత్తలను అభినందించారు. ఇది జనవరిలో ఇస్రో బాధ్యతలను తీసుకున్న కె. శివన్ యొక్క మొదటి మిషన్.