దేశ వ్యాప్తంగా సంచలనం రేపిన నిర్భయ గ్యాంగ్ రేప్, హత్య కేసులో నిందితుల ఉరిశిక్ష పలుమార్లు వాయిదా పడింది. ఉరిశిక్ష నుంచి తప్పించుకునేందుకు నిందితులు ఒకరి తర్వాత ఒకరు రాష్ట్రపతికి క్షమాభిక్ష పిటిషన్, క్యూరేటివ్ పిటిషన్, స్పెషల్ పిటిషన్లు దాఖలు చేస్తూ గడువు పొడిగించుకుంటున్నారు. అయితే ఇదే విధంగా అత్యాచారానికి గురైన తెలంగాణ వెటర్నరీ డాక్టర్ దిశను నిందితులు సజీవ దహనం చేసిన విషయం తెలిసిందే. నిర్భయ ఘటనపై, కేసు వాయిదాలపై దిశ తండ్రి స్పందించారు. జీ హిందూస్తాన్ ప్రతినిధితో దిశ తండ్రి మాట్లాడుతూ.. నిర్భయ కేసు దోషులకు గతంలోనే ఉరిశిక్ష అమలు చేసి ఉండే బాగుండేదన్నారు.
Also Read: నిర్భయ దోషులకు వారం రోజుల్లోనే ఉరి..!
నిర్భయ కేసులో దోషులకు శిక్ష పదే పదే వాయిదా పడటంపై దిశ తండ్రి తీవ్ర అసంతృప్తి వ్యక్తం చేశారు. ఇది కచ్చితంగా మన వ్యవస్థ వైఫల్యమని ఆయన అభిప్రాయపడ్డారు. నిర్భయ ఘటన ఆరు నెలల్లో విచారణ పూర్తి చేసి దోషులకు ఉరిశిక్ష వేసి ఉండాలన్నారు. అలా తక్కవ సమయంలో విచారణ చేపట్టి దోషులను శిక్షిస్తే అలాంటి తప్పు చేసే వారికి అది ఓ గుణపాఠంలా మారేదన్నారు. నిర్భయ తల్లి ఆశాదేవికి అందరం మద్దతుగా నిలవాల్సిన సమయమిదని చెప్పారు.
Also Read: నిర్భయపై మరోసారి గ్యాంగ్ రేప్.. మోదీజీ మీకు కనిపించడం లేదా: రామ్ గోపాల్ వర్మ
న్యాయవ్యవస్థను మనం గౌరవించాల్సిందే. ఏది ఏమైనా కానీ విచారణ సత్వరమే పూర్తిచేసి సరైన సమయంలో ఉరిశిక్ష అమలు చేయడం ఉత్తమమన్నారు. అలా కాని పక్షంలో ఎన్ కౌంటర్ చేయడమే మంచిదని అందరూ భావించే అవకాశం ఉందన్నారు. కోర్టు ప్రాంగణంలోనే దోషుల తరఫు న్యాయవాది వీపీ సింగ్ ఛాలెంజ్ చేయడంతో నిర్భయ తల్లి ఆశా దేవి కన్నీటి పర్యంతమయ్యారు. టీవీల్లో ఆశాదేవి పరిస్థి చూస్తే తమకు కూడా కన్నీళ్లు ఆగలేదన్నారు దిశ తండ్రి. ఏ బాధితురాలి తల్లిదండ్రులకైనా అది చాలా కఠిన సమయమని, ఆశా దేవి కంటతడి పెట్టుకోవడం తమను కలిచివేసిందన్నారు.
Also Read: దిశ కేసులో ఎన్‌కౌంటర్‌పై నిర్భయ తల్లి హర్షం
కాగా, 2012 డిసెంబర్ 16న కదులుతున్న బస్సులో నిర్భయపై ఆరుగురు అత్యాచారానికి పాల్పడ్డారు. ఆ సమయంలో ఆమె ప్రతిఘటించడంతో ఆ కామాంధులు మర్మావయాలలో రాడ్లు చొప్పించి చిత్రహింసలకు గురిచేశారు. అందులో ఒకరు మైనర్ కాగా, మూడేళ్లు జువైనెల్ హోమ్ లో ఉండి బయటకు వచ్చేశాడు. బస్సు డ్రైవర్ విచారణ జరుగుతున్న సమయంలో జైళ్లోనే ఆత్మహత్య చేసుకున్నాడు. మిగిలిన నలుగురు నిందితులు ముకేష్ సింగ్, అక్షయ్ ఠాకూర్, వినయ్ శర్మ, పవన్ గుప్తాలకు పాటియాలా హౌస్ కోర్టు తొలుత జనవరి 22న డెత్ వారెంట్ జారీ చేసింది. అయితే న్యాయపరమైన విషయాలు పూర్తికానందున ఫిబ్రవరి 1న ఉరితీసేలా మరో డెత్ వారెంట్ జారీ చేశారు. నలుగురు నిందితుల న్యాయపరమైన అవకాశాలు పూర్తికానందున డెత్ వారెంట్‌పై కోర్టు స్టే ఇచ్చింది. త్వరలో వారికి ఉరిశిక్ష అమలు కానుంది.