షిర్డీ సాయిబాబాను దర్శించుకున్న ప్రధాన మంత్రి మోదీ

షిర్డీ సాయిబాబాను దర్శించుకున్న ప్రధాన మంత్రి మోదీ

Last Updated : Oct 19, 2018, 09:56 PM IST
షిర్డీ సాయిబాబాను దర్శించుకున్న ప్రధాన మంత్రి మోదీ

ప్రధాని నరేంద్ర మోదీ మహారాష్ట్రలోని షిర్డీలో పర్యటిస్తున్నారు. ఈ సందర్భంగా ఆయన షిర్డీ సాయిబాబా మహా సమాధి శతాబ్ది ఉత్సవాల్లో పాల్గొన్నారు. ప్రత్యేక పూజలు చేశారు. సాయిబాబాను ప్రధాని మోదీతో పాటు గవర్నర్ విద్యాసాగర్‌రావు, సీఎం దేవేంద్ర ఫడ్నవీస్ దర్శించుకున్నారు.

 

అనంతరం షిర్డీలో ఏర్పాటు చేసిన ఓ సమావేశంలో మోదీ పాల్గొన్నారు. ప్రధానమంత్రి ఆవాస్ యోజన పథకం కింద అర్హులైన 2,44,444 మంది లబ్దిదారులకు మోదీ తాళంచెవులు అందజేశారు.

 

"పేదలకు సొంతింటి కలలు నెరవేర్చాలనేది మా ప్రభుత్వ లక్ష్యం. దీనిని దృష్టిలో ఉంచుకొని మా ప్రభుత్వం 2022 నాటికి ప్రతి కుటుంబానికి సొంతిల్లు నిర్మించి ఇవ్వాలని లక్ష్యంగా పెట్టుకుంది. ఈ క్రమంలో మేము సగం ప్రయాణాన్ని పూర్తి చేసినందుకు సంతోషిస్తున్నాను."అని షిర్డీలో జరిగిన ఒక బహిరంగ కార్యక్రమంలో ప్రధానమంత్రి అన్నారు.

 

ఈ క్రమంలో మోదీ యూపీఏ, కాంగ్రెస్ మీద నిప్పులు చెరిగారు. గత యూపీఏ ప్రభుత్వం కేవలం 25 లక్షల గృహాలను నిర్మించి ఇస్తే, గత నాలుగేళ్లలో భారతీయ జనతాపార్టీ నేతృత్వంలోని ఎన్డీయే కూటమి ప్రభుత్వం కోటి 25 లక్షల గృహాలను నిర్మించి ఇచ్చిందన్నారు.

 

తృప్తీ దేశాయ్ ముందస్తు అరెస్టు

ప్రధాని మోదీ షిర్డీ పర్యటన దృష్ట్యా.. సామాజిక కార్యకర్త తృప్తీ దేశాయ్‌ను పోలీసులు ముందస్తుగా అరెస్టు చేశారు. శబరిమలలో మహిళల ఆలయ ప్రవేశ అంశాన్ని మోదీతో చర్చించేందుకు తనకు అనుమతి ఇవ్వాలని తాజాగా తృప్తీ దేశాయ్ కోరారు. ఒకవేళ పర్మిషన్ ఇవ్వకపోతే.. మోదీ పర్యటనను అడ్డుకుంటామని హెచ్చరించారు. దీంతో తృప్తీ దేశాయ్‌ను హౌజ్ అరెస్టుచేసి పోలీసులను కాపలాగా పెట్టారు.

Trending News