అవకాశం చిక్కినప్పుడల్లా కేంద్రంలో అధికారంలో వున్న బీజేపీపై తన అసంతృప్తిని వెళ్లగక్కుతున్న ఆ పార్టీ మిత్రపక్షమైన శివ సేన తాజాగా బీజేపీకి మరో సవాల్ విసిరింది. కర్ణాటకలో ఆధిక్యం సొంతం చేసుకున్న బీజేపీ ఈవీఎం ట్యాంపరింగ్‌కి పాల్పడింది అని ఓవైపు కాంగ్రెస్ పార్టీ ఆరోపిస్తోంటే.. కాంగ్రెస్ ఆరోపణలకు కొనసాగింపుగా అన్నట్టుగా శివసేన అధినేత ఉద్ధవ్ థాకరే సైతం బీజేపీని ఇరుకున పెట్టే విధంగా ఓ ప్రకటన చేశారు. " కేవలం ఒకే ఒక్కసారైనా ఈవీఎంలు లేకుండా బ్యాలెట్ పేపర్స్‌తో బీజేపీ ఎన్నికలు నిర్వహించాలి. అప్పుడు బీజేపీపై వున్న అపోహలు, భయాందోళనలు వాటంతట అవే తొలగిపోతాయి" అని ఉద్ధవ్ థాఖరే బీజేపికి సవాల్ చేశారు.
కర్ణాటక ఎన్నికల ఫలితాల వెల్లడికి రెండు రోజుల ముందు సైతం ఎన్నికల ప్రచారం జరుగుతున్న తీరుపై శివసేన స్పందిస్తూ.. రాహుల్ గాంధీని చూసి బీజేపీ భయపడిపోతోంది అని అన్నారు. రాహుల్ గాంధీ సైతం 2014 ఎన్నికల సమయంలో వున్నప్పటిలా లేరని, అతడిలో ఎంతో పరిపక్వత వచ్చిందని కాంగ్రెస్‌కి అనుకూల వ్యాఖ్యలు చేసిన విషయం తెలిసిందే.