రూపే కార్డు, భీమ్ యాప్ పేమెంట్లపై 20% క్యాష్ బ్యాక్

వినియోగదార్లకు క్యాష్ బ్యాక్‌లు ఇవ్వాలన్న ప్రతిపాదనకు జీఎస్టీ మండలి ఆమోదముద్ర వేసింది.

Last Updated : Aug 5, 2018, 01:42 PM IST
రూపే కార్డు, భీమ్ యాప్ పేమెంట్లపై 20% క్యాష్ బ్యాక్

వినియోగదార్లకు క్యాష్ బ్యాక్‌లు ఇవ్వాలన్న ప్రతిపాదనకు జీఎస్టీ మండలి ఆమోదముద్ర వేసింది. సూక్ష్మ, చిన్న, మధ్య తరహా పరిశ్రమల(ఎంఎస్‌ఎంఈ)కు సంబంధించిన అంశాలపై చర్చించేందుకు శనివారం న్యూఢిల్లీలో జీఎస్టీ కౌన్సిల్‌ 29వ సారి భేటీ అయ్యింది. ఈ సమావేశానికి పలువురు మంత్రులు హాజరయ్యారు. ఎంఎస్‌ఎంఈ సెక్టార్‌లో ఉన్న సవాళ్లు, సమస్యల గురించి చర్చించిన జీఎస్టీ కౌన్సిల్‌.. శివ్‌ ప్రతాప్‌ శుక్లా నేతృత్వంలో కమిటీ ఏర్పాటు చేయాలని నిర్ణయించింది. ఈ కమిటీ ఎంఎస్‌ఎంఈ సెక్టార్‌లోని ఇబ్బందులు, పలు విషయాలను పరిశీలించాక నివేదిక ఇస్తుంది.

అటు 29వ జీఎస్టీ కౌన్సిల్‌ సమావేశంలో తాత్కాలిక ఆర్థిక మంత్రి పీయూష్ గోయల్‌ మాట్లాడుతూ.. డిజిటల్‌ లావాదేవీలను ప్రోత్సహించేందుకు రూపే కార్డు, భీమ్‌ యాప్ తదితర విధానాల ద్వారా చేసే డిజిటల్ పేమెంట్స్‌కు ప్రోత్సాహకాలు ఇవ్వాలని నిర్ణయించినట్లు తెలిపారు. జీఎస్టీపై 20శాతం క్యాష్‌బ్యాక్‌ (గరిష్ఠంగా రూ.100) ఇవ్వనున్నట్లు చెప్పారు. త్వరలోనే దీన్ని అమలు చేయనున్నామని తెలిపారు. తొలుత పైలట్‌ ప్రాజెక్టు కింద దీన్ని కొన్ని రాష్ట్రాల్లో అమలు చేశాక దేశవ్యాప్తంగా అమల్లోకి తెస్తామన్నారు. కాగా, ఈ క్యాష్ బ్యాక్‌కు వీలు కల్పించేందుకు ఒక సాఫ్ట్‌వేర్ సిద్ధం చేయాలని మండలి నిర్ణయించింది.

ఒక్కసారి ఇది అమల్లోకి వస్తే.. రూపే కార్డు, భీమ్, యూపీఐల ద్వారా వినియోగదార్లు జరిపే నగదు రహిత లావాదేవీలపై మొత్తం జీఎస్టీలో 20 శాతాన్ని వెనక్కి ఇస్తారు. అయితే గరిష్ట పరిమితి వందరూపాయలు ఉంటుందని తెలిపారు. కాగా ఈ నిర్ణయంపై పలువురు నిపుణులు హర్షం వ్యక్తం చేశారు.

Trending News