Gaddar Munugode Contest: మునుగోడు ఉప సమరంలో రోజుకో ట్విస్ట్ వెలుగు చూస్తోంది. ఇప్పటికే ప్రధాన పార్టీల అభ్యర్థులు ఖరారు కాగా.. మునుగోడులో పోటీ చేస్తానని ప్రజా యుద్ద నౌక గద్దర్ ప్రకటించడం సంచలనంగా మారింది. టీజేఎస్ అధినేత కోదండరామ్ కూడా తమ అభ్యర్థి బరిలో ఉంటారని తెలిపారు. వామపక్ష ఉద్యమాల్లో ఉన్న గద్దర్.. తెలంగాణ ఉద్యమంలో కీలక పాత్ర పోషించారు. బడుగు, బలహీన వర్గాల్లో ఆయనకు క్రేజీ ఉంటుంది. బీసీ, ఎస్సీ, ఎస్టీ, మైనార్టీ ఓటర్లే 90 శాతం ఉన్న మునుగోడులో గద్దర్ పోటీ చేస్తుండటం ప్రధాన పార్టీలను కలవరపరుస్తోంది. మునుగోడులో గద్దర్ పోటీ చేస్తే ఎవరికి నష్టం, ఎవరికి లాభం.. ఆయనతో ఎవరి ఓట్లు చీలుతాయి.. ఎవరికి గండం అన్నదానిపై రకరకాల చర్చలు సాగుతున్నాయి.
దసరా రోజున కేఏ పాల్ సారథ్యంలోని ప్రజాశాంతి పార్టీలో చేరారు గద్దర్. మునుగోడు నుంచి పోటీ చేస్తానని ప్రకటించారు. మునుగోడులో టీజేఎస్ బరిలో ఉంటుందని కోదండరామ్ ప్రకటించాకా గద్దర్ మాట మార్చారు. మునుగోడులో పోటీ చేయడం ఖాయమని.. అయితే ఏ పార్టీ నుంచి అన్నది ఇంకా ఫైనల్ కాలేదని చెప్పారు. ఆదివారం టీజేఎస్ అధ్యక్షుడు కోదండరామ్ తో సమావేశమయ్యారు. దీంతో గద్దర్ ప్రజాశాంతి పార్టీ నుంచి కాకుండా టీజేఎస్ అభ్యర్థిగా మునుగోడు బరిలో ఉండనున్నారా అన్న చర్చ సాగుతోంది. లేదు ప్రజాశాంతి పార్టీ నుంచే పోటీ చేస్తారని.. అయితే టీజేఎస్ మద్దతు కోరారని కొందరు చెబుతున్నారు. దాదాపు నాలుగు దశాబ్ధాలపాటు ఎన్నికల ప్రక్రియను తిరస్కరిస్తూ వచ్చిన గద్దర్.. ఇప్పుడు ఎన్నికలో పోటీ చేయడానికి సిద్ధం కావడమే సంచలనమైతే.. ఆయన పోటీతో మునుగోడులో ఏం జరగనుందన్నది మరింత ఆసక్తికరంగా మారింది.
వామపక్ష ఉద్యమాల్లో ఉన్న గద్దర్ కు లెఫ్ట్ పార్టీల్లో మంచి క్రేజీ ఉంది. మునుగోడు ఉప ఎన్నికలో సీపీఎం, సీపీఐ పార్టీలు అధికార టీఆర్ఎస్ పార్టీకి మద్దతు ఇచ్చాయి. బీజేపీని ఓడించడమే తమ లక్ష్యమని ప్రకటించాయి. గద్దర్ పోటీ చేస్తే కమ్యూనిస్టుల ఓట్లు చీలడం ఖాయంగా తెలుస్తోంది. టీఆర్ఎస్ తో పాటు గద్దర్ కు వామపక్షఓటు బ్యాంక్ చీలుతుందని అంచనా వేస్తున్నారు. ఇది గులాబీ పార్టీకి గండమే. అందుకే వామపక్షాల ఓట్లు పూర్తిగా కారు గుర్తుకు పడకుండా ఉండేందుకు బీజేపీనే గద్దర్ ను మునుగోడులో పోటీ చేయిస్తుందనే ఆరోపణలు టీఆర్ఎస్ వర్గాల నుంచి వస్తున్నాయి. కేఏ పాల్ గతంలో ఢిల్లీలో కేంద్రమంత్రులను కలిశారు, కేసీఆర్ సర్కార్ పై అవినీతీపై సీబీఐకి ఫిర్యాదు చేశారు. ఇవన్ని బీజేపీ డైరెక్షన్ లోనే సాగాయంటున్న గులాబీ నేతలు.. ఇప్పుడు మునుగోడులో గద్దర్ పోటీ కూడా కమలనాధుల కుట్రలో భాగమే అంటున్నారు. ఒకవేళ టీజేఎస్ నుంచి గద్దర్ పోటీ చేసినా అది కూడా బీజేపీ ఎత్తుగడే అంటున్నారు. తన ప్రత్యర్థి కేసీఆర్ కు షాకిచ్చేందుకు బీజేపీకి కలిసివచ్చేలా కోదండరామ్ తో ఇలా స్కెచ్ వేయించారనే వాదన వస్తోంది.
మరోవైపు మునుగోడులో గద్దర్ పోటీపై విపక్షాల వాదన మరోలా ఉంది. కాంగ్రెస్ , బీజేపీలు రెండు ప్రభుత్వ వ్యతిరేక ఓట్లపైనే ఆధారపడుతున్నాయి. కేసీఆర్ వ్యతిరేక ఓటును తమవైపు మళ్లించుకునేందుకు యత్నిస్తున్నాయి. గద్దర్ పోటీ చేస్తే మునుగోడులో ప్రభుత్వ వ్యతిరేక ఓటు చీలుతుందనే టాక్ వస్తోంది. విపక్షాల నేతలు కూడా ఇదే చెబుతున్నారు. గద్దర్ పోటీతో కేసీఆర్ వ్యతిరేక ఓటు చీలి అధికార పార్టీకే కలిసివస్తుందని బీజేపీ, కాంగ్రెస్ నేతలు అంటున్నారు. మొత్తంగా మునుగోడులో పోటీ చేస్తానన్న గద్దర్ ప్రకటన... మూడు ప్రధాన పార్టీలను పరేషాన్ చేస్తుందని తెలుస్తోంది. చూడాలి మరీ గద్దర్ తో గండం ఎవరికో...
Also Read : Komatireddy Venkat Reddy: ఎంపీ కోమటిరెడ్డి వెంకట్ రెడ్డి జంప్? క్లారిటీ ఇచ్చిన తెలంగాణ కాంగ్రెస్ లీడర్స్..
Also Read : Munugode Bypoll: 200 బ్రిజాకార్లు.. 2 వేల బైకులు బుకింగ్! మునుగోడు లీడర్లకు పండుగే పండుగ
స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్లోడ్ చేసుకోండి.
Android Link - https://bit.ly/3P3R74U
Apple Link - https://apple.co/3loQYe
Twitter , Facebookమా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి