Pawan Kalyan Election Campaign In Telangana: తాను ఏనాడూ పదవులు కోసం రాజకీయాల్లోకి రాలేదని.. అధికారం కోసం అర్రులు చాచలేదని జనసేన అధ్యక్షుడు పవన్ కళ్యాణ్ అన్నారు. అధికారం, పదవులు మాత్రమే ఆఖరి లక్ష్యం అయితే తాను ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలోనే రాజకీయాలు చేసుకునేవాడినన్నారు. అక్కడే ఉండిపోయేవాడినని చెప్పారు. తన ఆలోచన రెండు తెలుగు రాష్ట్రాల యువత బంగారు భవిష్యత్ అని.. పోరాడి సాధించిన తెలంగాణ రాష్ట్ర కలలు, ఆకాంక్షల సాకారం మాత్రమేనన్నారు. దీని కోసం మాత్రమే తాను తుదివరకూ రాజకీయాలు చేస్తానని.. తెలంగాణ సంపూర్ణ ఎదుగుదలకు జనసేన సహకారం పూర్తిస్థాయిలో ఉంటుందన్నారు. తెలంగాణ ఎన్నికల ప్రచారంలో భాగంగా జనసేన-బీజేపీ అభ్యర్థుల విజయాన్ని కాంక్షిస్తూ దుబ్బాకలో ఏర్పాటు చేసిన సకల జనుల విజయ సంకల్ప సభలో జనసేనాని ప్రసంగించారు.
"తెలంగాణ యువత అంటే పోరాటానికి నిలువెత్తు నిదర్శనం. ఇక్కడ యువతలో అమితమైన శక్తి ఉంది. తెగింపు ఉంది. తమ ప్రాంతానికి అన్యాయం జరిగితే చూస్తూ ఊరుకునే యువత కాదు. తిరగబడి ధించుకుంటారు. వారి పోరాట స్పూర్తి నన్ను రాజకీయాల్లోకి వచ్చేలా ప్రేరేపించింది. దశాబ్దాల ఆకాంక్ష అయిన తెలంగాణ రాష్ట్రం సాకారమైంది. ఇక ప్రగతి బాటలో రాష్ట్రం ముందుకు సాగాలి. ఇక్కడి ప్రజలు దేనికోసం పోరాడారో వారి ఆకాంక్షలన్నీ తీరాలి. వెలుగులీనే తెలంగాణ రావాలి. సమష్టిగా దీని కోసం ప్రతి ఒక్కరూ కష్టపడదాం. పోరాడి తెచ్చుకున్న రాష్ట్రాన్ని ప్రగతి దశలో నిలిపేందుకు సుస్థిరమైన పరిపాలనకు, అన్ని విధాలుగా రాష్ట్రాన్ని ముందుకు తీసుకువెళ్లే భారతీయ జనతా పార్టీ నాయకత్వాన్ని బలపరుద్దాం. కచ్చితంగా తెలంగాణ ఆకాంక్షలను బీజేపీ నాయకత్వం తప్పనిసరిగా తీరుస్తుందని నేను విశ్వసిస్తున్నాను.
అధికారం ఏ ఒక్కరి సొత్తూ కాదు. సమాజంలో ఉన్న అన్ని వర్గాలకు అధికారం దగ్గర కావాలి. తెలంగాణ సాధించుకున్నప్పుడు దళితుడు ముఖ్యమంత్రి అవుతాడని అంతా అనుకున్నాం. అంతా సంతోషించాం. ఆ కల నెరవేరలేదు. ఇప్పుడు భారతీయ జనతా పార్టీ కచ్చితంగా బీసీ వర్గాల నుంచి ముఖ్యమంత్రిని చేస్తామని మాటకు తెలంగాణ ప్రజానీకం అంతా మద్దతుగా నిలవాలి. అధికారం అనేది ఏ ఒక్కరి సొత్తు కాదు. కచ్చితంగా అది అందరికీ అందాలి. అప్పుడే సమాజంలో సంపూర్ణ మార్పు సాధ్యం. సమాజంలోని అన్ని వర్గాలకు అధికారం దగ్గర అన్ని వర్గాలు అభ్యున్నతి పథంలో నడిస్తేనే ఆ సమాజం మెరుగ్గా మారుతుంది. గతంలో జరిగిన దుబ్బాక ఉప ఎన్నికల్లోను సోదరులు రఘునందన్ రావు ఇక్కడి ప్రజానీకానికి ఇచ్చిన ప్రతి హామీని నెరవేర్చారు.
ఈ ప్రాంతాన్ని పూర్తిస్థాయిలో అభివృద్ధి దిశగా నడిపిస్తున్న ఆయనకు వచ్చే ఎన్నికల్లో మంచి మెజారిటీతో గెలిపిస్తే శాసనసభలో నియోజకవర్గం నుంచి మంచి ప్రాతినిధ్యం లభిస్తుంది. ఏ విషయాన్ని అయినా పూర్తిస్థాయిలో అర్ధం చేసుకొని మాట్లాడే రఘునందన్ రావు లాంటి నాయకులు అవసరం ఎంతైనా ఉంది. అలాంటి వారిని గెలిపించుకోవాలి. తెలంగాణలో బీజేపీతో కలిసి జనసేన చేస్తున్న రాజకీయ ప్రయాణంలో అన్ని వర్గాలకు న్యాయం జరగాలన్నదే తుది ఆశయం. దీనికి చివరి వరకు కట్టుబడి పని చేస్తాం. తెలంగాణలోని పల్లెలు పట్టణాలు పూర్తిస్థాయిలో సుందరంగా తయారయ్యేలా, తెలంగాణ ప్రజలందరికీ ఉద్యోగ ఉపాధి అవకాశాలు పుష్కలంగా లభించేలా చూడాలి అన్నదే లక్ష్యం. దీనికోసం రాజకీయంగా ఉన్నత ఆలోచనతో తెలంగాణ యువత వచ్చే ఎన్నికల్లో బీజేపీ-జనసేన పార్టీలకు మద్దతుగా నిలవాలి" అని పవన్ కళ్యాణ్ కోరారు.
Also Read: CM Jagan Mohan Reddy: 10,511 జంటలకు రూ.81.64 కోట్ల లబ్ధి.. అకౌంట్‌లోకి డబ్బులు జమ
స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.
ఆండ్రాయిడ్ లింక్ - https://bit.ly/3P3R74U
ఆపిల్ లింక్ - https://apple.co/3loQYe
సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి Twitter, Facebook