విజయవాడ: తెలంగాణ ప్రభుత్వంతో స్నేహపూర్వకంగా మెదిలే పార్టీ ఏపీలో అధికారంలోకొస్తే, ఏపీలో అభివృద్ధితోపాటు పోలవరం ప్రాజెక్టు అటకెక్కుతుందని నటుడు శివాజి ఆరోపించారు. తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్‌తో వైఎస్సార్సీపీ అధినేత వైఎస్ జగన్ స్నేహపూర్వకంగా ఉండటాన్ని తప్పుపట్టే క్రమంలో శివాజీ ఈ వ్యాఖ్యలు చేశారు. పోలవరం ప్రాజెక్టు అంశంపై 'నిజం' పేరుతో విజయవాడలో మీడియా సమావేశాన్ని ఏర్పాటు చేసిన శివాజి.. అక్కడ వీడియో ప్రజెంటేషన్ ద్వారా తనకు తోచిన విషయాలను మీడియాతో పంచుకున్నారు. ఈ సందర్భంగా ఏపీ ప్రతిపక్ష నేత వైఎస్ జగన్, తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్, ప్రధాని నరేంద్ర మోదీలపై శివాజీ సంచలన ఆరోపణలు చేశారు. ఆంధ్రప్రదేశ్ అభివృద్ధిని అడ్డుకునేందుకు కేసీఆర్, మోదీ కుట్రలు చేస్తున్నారని ఆరోపించిన శివాజీ.. ప్రధాని మోదీ గారి దాష్టికం ఆంధ్రప్రదేశ్‌కి శాపం అని అన్నారు. పోలవరం ప్రాజెక్టును ఆపడానికి ప్రధాని నరేంద్ర మోదీ కంకణం కట్టుకున్నారని, అలాగే కేసీఆర్‌తో స్నేహం పులి మీద సవారీ లాంటిదని చెబుతూ ఆయనతో జగన్ ఎందుకు స్నేహం చేస్తున్నారో తనకు అర్థం కావడం లేదని అన్నారు. కేసీఆర్‌కి కూడా జగన్‌పై కచ్చితంగా అంత ప్రేమ ఉంటుందని తాను భావించడం లేదని శివాజీ అభిప్రాయపడ్డారు.
రాష్ట్ర ప్రజల కోసం ప్రాణాలు ఇవ్వడానికైనా తాను సిద్ధంగా ఉన్నాను కనుకే తాను అన్ని రాజకీయ పార్టీలను నిలదీశానని శివాజీ స్పష్టంచేశారు. వైఎస్ జగన్ కానీ లేదా పవన్ కల్యాణ్ కానీ అధికారంలోకొస్తే తాను కోల్పోయేది ఏమీ లేదని అలాగని చంద్రబాబు గారు అధికారంలోకొస్తే తనకు కానీ లేదా తన కుటుంబానికి కానీ ఒరిగేదేమీ లేదని చెబుతూ కేవలం రాష్ట్ర ప్రయోజనాల కోసమే ఇవాళ ఈ విషయాన్ని మీడియా ముందుకు తీసుకొస్తున్నానని శివాజీ తేల్చిచెప్పారు. తాను డబ్బుల కోసం కక్కుర్తి పడేవాడినే అయితే, బీజేపీలోంచి బయటికొచ్చే వాడినే కాదని, తనకు సినిమాలు లేవని కొంతమంది ఎగతాళి చేస్తున్నారు కానీ తనది సినిమాలు లేని ఫేసా అని శివాజీ ఆవేదన వ్యక్తంచేశారు.