Chandrababu Arrest in Skill Development Scam: స్కిల్ డెవలప్‌మెంట్ కేసులో టీడీపీ అధ్యక్షుడు చంద్రబాబు నాయుడిని అరెస్ట్ చేసినట్లు ఏపీ సీఐడీ అదనపు డీజీ సంజయ్ తెలిపారు. స్కిల్ స్కామ్‌పై చంద్రబాబుకు పూర్తి సమాచారం ఉందని తమ వద్ద తగిన ఆధారాలున్నాయని స్పష్టంచేశారు. అప్పట్లో ప్రభుత్వం నుంచి నిధులు ఏ సంస్థ నుంచి ఎక్కడికి వెళ్లి.. ఎలా తమ నేతల వద్దకు చేరాయనే విషయాలన్నీ ఆయన కనుసన్నల్లో జరిగాయన్నారు. నిధులు విడుదల చేయాలని ఆయనే ఆర్థిక శాఖను ఆదేశించారని తెలిపారు. ఆయన కేంద్రంగానే అన్నీ జరగడంతో ఏ1గా చేర్చామన్నారు. నంద్యాలలో అరెస్ట్ చేసిన సీఐడీ అధికారులు.. విజయవాడ తరలించిన విషయం తెలిసిందే.
ఈ నేపథ్యంలో సీఐడీ అదనపు డీజీ సంజయ్ మీడియాతో మాట్లాడుతూ.. ఏపీ సీఐడీ స్కిల్ డెవలప్మెంట్ ప్రోగ్రాంను స్కామ్ చేసేందుకే ప్రారంభించారని తెలిపారు. ఇందుకోసం అప్పటి మంత్రిమండలి ఆమోదం లేకుండానే స్కిల్ కార్పొరేషన్‌ను తీసుకొచ్చిన చంద్రబాబు.. గంటా సుబ్బారావుకు ఈ సంస్థ బాధ్యతలు అప్పగించారన్నారు. అంతేకాక ఈ సుబ్బారావుకు సీఎం సలహాదారు, ఉన్నత విద్యాశాఖలో ఉన్నత హోదా సహా నాలుగు పదవులు ఇచ్చారని చెప్పారు. ఈయన ద్వారా బాబు నిధులు మళ్లించేలా వ్యూహం రచించారని స్కామ్ వివరాలు వెల్లడించారు.
చంద్రబాబును విజయవాడలోని ఏసీబీ కోర్టులో ఈ లోపు హాజరుపరుస్తామని తెలిపారు. తమ అధికారులు అర్ధరాత్రి నంద్యాలకు చేరుకున్నా.. ఉదయం గం.6 సమయంలో ఆయనతో మాట్లాడామన్నారు. ఓర్వకల్లు నుంచి విజయవాడకు హెలికాప్టర్లో తరలిస్తామని చెప్పగా.. చంద్రబాబు తిరస్కరించారని చెప్పారు. ఆయన వయసు, ఆరోగ్యం, హోదా దృష్ట్యా అన్ని జాగ్రత్తలు తీసుకుంటున్నామన్నారు. స్కిల్ డెవలప్మెంట్ స్కామ్‌లో దాదాపు రూ.550 కోట్ల వరకు అవినీతి జరిగిందన్నారు. చంద్రబాబుకు అన్ని విషయాలు తెలిసే జరిగాయని.. ఈ కేసులో ఆయనపై ఆరోపణలు నిరూపితమైతే పదేళ్ల వరకు జైలు శిక్ష పడవచ్చని తెలిపారు. ఈ స్కాంలో చంద్రబాబు పాత్ర గురించి మరిన్ని వివరాలు రాబట్టేందుకే ఆయనను అదుపులోకి తీసుకున్నట్లు పేర్కొన్నారు.
స్కిల్ డెవలప్‌మెంట్ స్కామ్‌కు సంబంధించిన కీలక డాక్యుమెంట్లు మాయం చేశారని.. ఈడీ, జీఎస్టీ ఏజెన్సీలు కూడా విచారణ చేపట్టాయని తెలిపారు డీజీ సంజయ్. ఈ ఒప్పందానికి డిజైన్ టెక్ ప్రధాన సూత్రధారి అని వెల్లడించారు. డిజైన్ టెక్‌కి సంబంధించిన భాస్కర్ భార్య అపర్ణ.. యూపీ క్యాడర్ స్కిల్ కార్పొరేషన్ డిప్యూటీ సీఈవోగా నియమితులయ్యారని చెప్పారు. సీమెన్స్ నుంచి 90 శాతం నిధులు రిలీజ్ కాకపోయినా.. 371 కోట్ల రూపాయలను ఏపీ ప్రభుత్వం తమ వాటాగా విడుదల చేసిందని.. ఈ విషయంపై ఆర్థిక శాఖ, సీఎస్ అభ్యంతరాలను కూడా పట్టించుకోలేదన్నారు. రూ.58 కోట్ల సాఫ్ట్‌వేర్‌ను రూ.3 వేల కోట్ల ప్రాజెక్ట్‌గా చూపించారని వివరాలను వెల్లడించారు.
Also Read: Chandrababu Arrest: నంద్యాలలో చంద్రబాబు అరెస్టు, రాష్ట్రవ్యాప్తంగా బస్సులకు బ్రేక్
Also Read: Chandrababu Arrest: ఆర్ధిక నేరాల్లో నోటీసులెందుకు, చంద్రబాబుపై అరెస్టుపై స్పష్టత
స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.
ఆండ్రాయిడ్ లింక్ - https://bit.ly/3P3R74U
ఆపిల్ లింక్ - https://apple.co/3loQYe
సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి Twitter, Facebook
Chandrababu Arrest Latest Updates: చంద్రబాబే ప్రధాన కుట్రదారు.. పదేళ్ల జైలు శిక్షకు అవకాశం: ఏపీ సీఐడీ చీఫ్