ఆంధ్రప్రదేశ్‌లో గాంధీ దేవాలయం ప్రారంభంకానుంది. విజయవాడలోని పాలఫ్యాక్టరీ సమీప సయ్యద్ అప్పలస్వామి కళాశాల ప్రాంగణంలో నిర్మించిన గాంధీజీ దేవాలయాన్ని ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు ప్రారంభించనున్నారు. సీఎం మధ్యాహ్నం రెండు గంటలకు గాంధీ దేవాలయాన్ని ప్రారంభిస్తారని దేవాలయం కమిటీ అధ్యక్షుడు రాంపిళ్ళ జయప్రకాశ్ తెలిపారు. గాంధీ దేవాలయంతో పటు సుభాష్‌చంద్ర బోస్ శిష్యుడు పండిట్ షీలా భద్రయాజీ, రాజ్యాంగ నిర్మాత బీఆర్ అంబేద్కర్‌కు ఇష్టుడైన చౌదరి రణబీర్ సింగ్ విగ్రహాలను కూడా ముఖ్యమంత్రి ఆవిష్కరిస్తారని ఆయన తెలిపారు.
కాగా ఇది రాష్ట్రంలోనే తొలిసారిగా గాంధీజీకి ఆలయం .. గాంధీజీ 150వ జయంతి సందర్భంగా ఈ ఆలయం నిర్మించినట్లు తెలిపారు. 1929లో గాంధీజీ విజయవాడకు వచ్చారు. అప్పట్లో మహాత్ముడు నడియాడిన ప్రాంతంలోనే ఆలయం నిర్మించారు. మహాత్ముడి స్ఫూర్తిని చాటే లక్ష్యంతో గుడి కట్టినట్లు గాంధేయవాదులు చెప్పారు. కాగా సీఎం పర్యటన నేపథ్యంలో అధికారులు భద్రత ఏర్పాట్లు చేశారు.
మంగళవారం బాపూ జయంతి సందర్భంగా ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు ఆయనకు ఘనంగా నివాళులు అర్పించారు. విజయవాడ నగరంలో స్వచ్ఛతే సేవా కార్యక్రమానికి హాజరై.. గాంధీజీ విగ్రహానికి పూలమాల వేసి నివాళులర్పించారు. తరువాత స్థానికులతో కలిసి ఆయన పరిసరాలను శుభ్రం చేశారు.
ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. గాంధీ ఆచరించిన సిద్ధాంతాలు నేటికీ ఆచరణీయమని అన్నారు. జాతిని సమైక్యత పరిచిన మహోన్నత వ్యక్తి గాంధీజీ అని కొనియాడారు. గాంధీజీ అహింసా విధానం వల్లే దేశానికి స్వాతంత్ర్యం వచ్చిందని, గాంధీజీని ఆదర్శంగా తీసుకుని యువత ముందుకెళ్లాలని ముఖ్యమంత్రి చంద్రబాబు పిలుపునిచ్చారు.