Tirumala: తిరుమల శ్రీవారి నవరాత్రి బ్రహ్మోత్సవాలు అక్టోబరు 15 నుంచి 23వ తేదీ వరకు అంగరంగ వైభవంగా నిర్వహించనున్నట్లు టీటీడీ ఈవో ఎవి ధర్మారెడ్డి తెలిపారు. మంగళవారం తిరుమలలోని అన్నమయ్య భవన్‌లో జిల్లా కలెక్టర్ వెంకట్రమణారెడ్డి, ఎస్పీ పరమేశ్వర్‌రెడ్డితో కలిసి ఈవో బ్రహ్మోత్సవాలపై సమీక్ష నిర్వహించారు. ఈవో మీడియాతో మాట్లాడుతూ, అక్టోబరు 14వ తేదీ అంకురార్పణంతో ప్రారంభం కానున్న ఈ ఉత్సవాలకు టీటీడిలోని అన్ని విభాగాలు సమన్వయంతో భక్తులకు ఎలాంటి అసౌకర్యం కలగకుండా ఏర్పాట్లు చేపట్టినట్లు ఆయన చెప్పారు. అక్టోబరు 19న గరుడసేవ, 20న పుష్పక విమానం, 22న స్వర్ణరథం, అక్టోబర్ 23న చక్రస్నానం నిర్వహించనున్నట్లు తెలిపారు.
బ్రహ్మోత్సవాలలో వయోవృద్ధులు, దివ్యాంగులు, సంవత్సరం లోపు చిన్నపిల్లల తల్లిదండ్రుల ప్రత్యేక ప్రవేశ దర్శనాలను రద్దు చేసినట్లు ఈవో చెప్పారు. అక్టోబర్ 19న గరుడసేవ సందర్భంగా ఆ రోజు ద్విచక్ర వాహనాలను అనుమతించరన్నారు. "గరుడసేవనాడు గరుడ వాహనాన్ని వీక్షించేందుకు ముందు రోజు రాత్రి నుండే అసంఖ్యాకంగా భక్తులు గ్యాలరీలలో వేచి ఉంటారన్నారు. కావున భక్తుల సౌకర్యార్థం గరుడ వాహనాన్ని ముందుగా ప్రారంభించేందుకు సాధ్య సాధ్యాలను అర్చకులతో చర్చించి నిర్ణయం తీసుకోనున్నట్లు" ఆయన తెలిపారు. అనంతరం జిల్లా కలెక్టర్ మరియు ఎస్పీ కూడా మీడియాతో మాట్లాడుతూ.. నవరాత్రి బ్రహ్మోత్సవాలను భక్తులకు ఎలాంటి అసౌకర్యం కలగకుండా నిర్వహించడానికి టీటీడీతో సమన్వయం చేసుకొని అన్ని ప్రభుత్వ విభాగాలు పనిచేయడానికి సిద్ధంగా ఉన్నాయని తెలిపారు.
నేవీ ముంబైలో శ్రీ వేంకటేశ్వర స్వామి ఆలయ నిర్మాణానికి మంగళవారం తిరుమలలోని సింఘానియా గ్రూప్‌తో టీటీడీ ఎంఓయూ కుదుర్చుకుంది. తిరుమలలోని అన్నమయ్య భవన్‌లో టీటీడీ ఈవో ఏవి. ధర్మారెడ్డి, రేమండ్ గ్రూప్ చైర్మన్, మేనేజింగ్ డైరెక్టర్ గౌతమ్ హరి సింఘానియా సమక్షంలో ఈ మేరకు ఒప్పందం జరిగింది. అనంతరం ఈవో మీడియాతో మాట్లాడుతూ, ముంబాయి ఉల్వే ప్రాంతంలో మహారాష్ట్ర ప్రభుత్వం కేటాయించిన 10 ఎకరాల భూమిలో రూ.70 కోట్లతో శ్రీవారి ఆలయాన్ని నిర్మించేందుకు దాత ముందుకు వచ్చారని తెలిపారు. ఈ ఆలయ నిర్మాణాన్ని త్వరలో ప్రారంభించి ఏడాది కాలంలో పూర్తి చేస్తామని ఆయన చెప్పారు.
Also Read: Chandrabau Case: చంద్రబాబు క్వాష్ పిటీషన్‌పై సుప్రీంలో విచారణ శుక్రవారానికి వాయిదా
స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.
Android Link - https://bit.ly/3P3R74U
Apple Link - https://apple.co/3loQYe
Twitter , Facebookమా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి