Telangana Politics: బీఆర్ఎస్ అధినేత కేసీఆర్ పేరు ఇప్పుడు అధికార పార్టీలో కూడా రీసౌండ్ వస్తుంది. తెలంగాణ రాష్ట్ర ఏర్పాటు తర్వాత దాదాపు దశాబ్ద కాలం పాటు కేసీఆర్ తెలంగాణ సీఎంగా ఉన్నారు. బీఆర్ఎస్ హయాంలో పాలనలో తనదైన ముద్ర వేసుకున్నారు. అలాంటి కేసీఆర్ ఏడాది క్రితం జరిగిన అసెంబ్లీ ఎన్నికల్లో ఓటమి తర్వాత ప్రజా క్షేత్రానికి దూరంగా ఫాం హైజ్ కు మాత్రమే పరిమితం అయ్యారు. ఎన్నికల్లో ఓడినా కేసీఆర్ చుట్టే రాజకీయాలు తిరుగుతున్నాయంటే తెలంగాణ రాజకీయాల్లో కేసీఆర్ ఎంతటి ప్రభావం చూపుతున్నారో అర్థం చేసుకోవచ్చు. అలాంటి కేసీఆర్ ను ఇప్పుడు అధికార పార్టీ ఎమ్మెల్యేలు సైతం అభిమానించడం, ప్రశంసించడం మాత్రం పాలిటిక్స్ లో సరికొత్త చర్చకు దారితీస్తుంది. సాధారణ రాజకీయాల్లో ప్రతిపక్ష నేతపై అధికార పక్షం ఎమ్మెల్యేలు దూకుడుగా విమర్శలు గుప్పిస్తుంటారు కానీ తెలంగాణలో మాత్రం దీనికి భిన్నంగా కొందరు రూలింగ్ పార్టీ ఎమ్మెల్యే అపోజిషన్ లీడర్ ను పొగడడం మాత్రం ఇప్పుడు ఆసక్తికరంగా మారింది.
ఇటీవల కాలంలో కాంగ్రెస్ లో ఇలాంటి నేతలు పెరిగిపోతున్నారు. కొద్ది రోజుల క్రితం మునుగోడు ఎమ్మెల్యే కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి ఇలాంటి వ్యాఖ్యలే చేశారు. కాంగ్రెస్ ప్రభుత్వం అనేక సంక్షేమ కార్యక్రమాలు చేపడుతున్నా..తెలంగాణ ప్రజలు మాత్రం కేసీఆర్ ను మరిచిపోలేక పోతున్నారని సంచలన వ్యాఖ్యలు చేశారు. అంతటితో ఆగని రాజగోపాల్ కేసీఆర్ పథకాలే బాగుంటున్నాయని రాజగోపాల్ రెడ్డి కామెంట్స్ చేయడం కాంగ్రెస్ లో పెద్ద కలకలం సృష్టించింది. తెల్లారిలేస్తే కేసీఆర్ అంటే విరుచుకుపడే రాజగోపాల్ రెడ్డి ఇలా ఉన్నట్లుండి బీఆర్ఎస్ అధినేత కేసీఆర్ కు అనుకూలంగా మాట్లాడంతో కాంగ్రెస్ లో పెద్ద ఎత్తున చర్చ జరుగుతుంది. రాజగోపాల్ రెడ్డి ఎందుకు కేసీఆర్ ప్రస్తావన తీసుకువచ్చారా అని కాంగ్రెస్ నేతలు ఆరా తీస్తున్నారు. మంత్రి పదవిపై తెగ ఆశపెట్టుకున్న రాజగోపాల్ రెడ్డికి అది సాధ్యం కాదని తెలిసీ ఇలా సొంత పార్టీనే ఇబ్బంది పెట్టేవిధంగా కామెంట్స్ చేస్తున్నారంటూ కాంగ్రెస్ లో గుసగుసలు వినపడుతున్నాయి.
ఇక పటాన్ చెరువు ఎమ్మెల్యే గూడెం మహిపాల్ రెడ్డి కథ మరో రకంగా ఉంది. ఇటీవలే గూడెం బీఆర్ఎస్ నుంచి అధికార కాంగ్రెస్ లోకి వెళ్లారు. మహిపాల్ రెడ్డి కాంగ్రెస్ లోకి వెళ్లినా మనస్సు మాత్రం కేసీఆర్ దగ్గరకే ఉందని నియోజకవర్గంలో తెగ ప్రచారం జరుగుతుంది. కాంగ్రెస్ లో చేరినా తన ఎమ్మెల్యే క్యాంపు ఆఫీసులో గులాబీ బాస్ కేసీఆర్ ఫోటో పెట్టుకోవడం ఇప్పుడు తెగ సంచలనంగా మారింది. గూడెం మహిపాల్ రెడ్డి క్యాంపు ఆఫీసులో కేసీఆర్ ఫోటో పెట్టుకోవడంపై కాంగ్రెస్ శ్రేణులు తీవ్రంగా ఆక్షేపిస్తున్నాయి.అంతే కాదు కాంగ్రెస్ లోని మహిపాల్ రెడ్డి వ్యతిరేకంగా వర్గం దీనిపై నిరసనలు కూడా చేపట్టాయి. ఐనా గూడెం మాత్రం కేసీఆర్ ఫోటో తీసేది లేదు. కేసీఆర్ అంటే నాకు అభిమానం అంటూ తెగేసి చెబుతున్నారు. దీంతో గూడెం వైఖరిపై కాంగ్రెస్ శ్రేణులు మండిపడుతున్నాయి. ఐనా ఎమ్మెల్యే ఏ మాత్రం వెనక్కితగ్గకపోవడంతో పార్టీలో పెద్ద ఎత్తున చర్చ జరుగుతుంది.
ఇక మరో సీనియర్ ఎమ్మెల్యే, మాజీ మంత్రి, హైదరాబాద్ రాజకీయాల్లో పట్టున్న పొలిటీషియన్ దానం నాగేందర్ తీరు కూడా ఇలానే ఉంది. ఇటీవల పలు సందర్భాల్లో గులాబీ బాస్ కేసీఆర్ అంటే తనకు అభిమానం అని చెప్పుకుంటూ వస్తున్నారు. తన రాజకీయం జీవితంలో నాకు నచ్చిన రాజకీయ నేతల్లో దివంగత నేత వైఎస్ రాజశేఖర్ రెడ్డి ఒకరు కాగా బీఆర్ఎస్ అధినేత కేసీఆర్ మరొకు అంటూ చెప్పుకొచ్చారు. వీరిద్దరి పోటోలు నా ఇంట్లో ఉంటాయంటూ కూడా దానం చెప్పారు. అంతే కాదు రాజకీయాలు వేరు అభిమానం వేరు. ఈ రెండింటికి ముడి పెట్టవద్దని ఇటీవల చిట్ చాట్ లో సెలవిచ్చారు దానం. ఈ ఇద్దరు నేతలు ప్రజల మనస్సులో చెరుగని ముద్ర వేశారని. వీరంటే తనకు కూడా ప్రత్యేకమైన అభిమానం అని దానం నాగేందర్ అన్నారు. మొన్నటి ఎన్నికల్లో బీఆర్ఎస్ నుంచి కాంగ్రెస్ లో చేరినా దానం మాత్రం ఇంకా కేసీఆర్ ను తలుచుకోవడంపై మాత్రం హస్తం పార్టీలో పెద్ద చర్చే జరుగుతుంది.
ఇక ఈ ఎమ్మెల్యేల తీరు ఇలా ఉంటే కాంగ్రెస్ కు చెందిన ఓ ఎమ్మెల్సీ తీరు కూడా ఇప్పుడు తీవ్ర చర్చ నీయాంశంగా మారింది.గత కొద్దేళ్లుగా బీఆర్ఎస్ ,కేసీఆర్ అంటే రెచ్చిపోయే ఎమ్మెల్సీ నవీన్ ఆలియాన్ తీన్మార్ మల్లన్న సైతం కేసీఆర్ పేరు ప్రస్తావిస్తుండడం ఆసక్తికరంగా మారింది. ఆ మధ్య జరిగిన ఒక బహిరంగ సభలో బీసీల కోసం అవసరమైతే కేసీఆర్ ను కలుస్తాని చెప్పడం అప్పట్లో పెద్ద దుమారాన్నే రేపింది.అంతే కాదు ఇటీవల ప్రభుత్వం చేపట్టిన కులగణన పై తీన్మార్ మల్లన్న తీవ్ర వ్యాఖ్యలు చేశారు. అంతటితో ఆగన మల్లన్న కేసీఆర్ చేపట్టిన సమగ్ర సర్వేపై ప్రశసంలు కురిపించడం మాత్రం కొంత కాంగ్రెస్ లో కలవరం సృష్టిస్తుంది. కేసీఆర్ అంటే ఇంతెత్తు లేచే మల్లన్న సైతం గులాబీ బాస్ కు మద్దతుగా మాట్లాడడం కాంగ్రెస్ శ్రేణులు జీర్ణించుకోలేకపోతున్నాయి
మొత్తంగా కాంగ్రెస్ లో ఇప్పుడు నేతలు కేసీఆర్ జపం చేస్తున్నారు.అధికార పార్టీలో ఉండి ప్రతిపక్ష నేతను పొగడడంపై మాత్రం కాంగ్రెస్ కు కొంత ఇబ్బందికర పరిణామమే. ఇలాంటి నేతల విషయంలో అధిష్టానం కానీ సీఎం రేవంత్ రెడ్డి కానీ ఏం చేస్తారో అనేది మాత్రం వేచి చూడాల్సిందే.
ఇదీ చదవండి : చిరంజీవి, కీర్తి సురేష్ తల్లితో రొమాన్స్ చేసిన ఈ సినిమా తెలుసా..! అందులో మెగాస్టార్ విలన్..
స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.
ఆండ్రాయిడ్ లింక్ - https://bit.ly/3P3R74U
ఆపిల్ లింక్ - https://apple.co/3loQYe
Twitter, Facebookసోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి.