ఈ మధ్యకాలంలో దక్షిణ కాశ్మీర్ ప్రాంతంలో టెర్రరిస్టుల కార్యకలపాలు బాగా పెరిగాయని.. అనేకమంది యువకులను మభ్యపెట్టి ఉగ్రవాద సంస్థలు వారిని ఉగ్రవాదం వైపు ప్రేరేపిస్తున్నాయని బ్రిగేడియర్ సచిన్ మాలిక్ ఏఎన్ఐతో తెలిపారు. దక్షిణ కాశ్మీర్ ప్రాంతంలో దాదాపు 200 మంది టెర్రరిస్టులు కార్యకలాపాలు నిర్వహిస్తున్నట్లు తమకు సమాచారం అందిందని.. వారిని మట్టుబెట్టడమే ఇండియన్ ఆర్మీ ముందున్న లక్ష్యమని ఆయన తెలిపారు.
ఈ రోజు జమ్ము కాశ్మీర్ ప్రాంతంలోని కులగాం జిల్లాలో అయిదుగురు టెర్రరిస్టులను భారత జవాన్లు మట్టుబెట్టారు. ఆ టెర్రరిస్టుల్లో పలువురు లష్కరే తోయిబా, హిజ్బుల్ ముజాహిదిన్ గ్రూపులకు చెందిన వారు కూడా ఉండడం గమనార్హం. వారిని ఎన్‌కౌంటర్ చేసిన ప్రాంతంలో ఓ పెద్ద ఆయుధగారం కూడా ఉన్నట్లు భారత సైనికాధికారులు గుర్తించారు. ఈ రోజు ఉదయం ఈ ఎన్‌కౌంటర్ జరగగా.. సైన్యం ఆ తర్వాత చుట్టుప్రక్కల ప్రాంతాలలో సెర్చ్ ఆపరేషన్ కూడా నిర్వహించింది. అయితే ఆ ఆపరేషన్ జరుగుతున్నప్పుడే పలువురు టెర్రరిస్టులు సైన్యంపై కాల్పులు జరిపారు.
ఈ ఘటనకు సంబంధించి స్థానిక పోలీసు ఒకరు మాట్లాడుతూ, తాజాగా జరిగిన ఎన్‌కౌంటర్‌లో నిషేధిత ఉగ్రవాద సంస్థలకు చెందిన ఉగ్రవాదులను మట్టుబెట్టడాన్ని అతిపెద్ద విజయంగా పేర్కొన్నారు. గతంలో ఈ టెర్రిరిస్టుల వల్ల ఆ ప్రాంతంలో పలువురు బ్యాంకు ఉద్యోగులతో పాటు పోలీసులు కూడా చనిపోయారని తెలిపారు. ఇటీవలి కాలంలో ఈ ఉగ్రవాదులు రాత్రివేళలలో బ్యాంకులపై పడి దోచుకోవడం కూడా ప్రారంభిస్తున్నారని.. యువతను ఉగ్రవాదం వైపు ప్రేరేపిస్తూ.. అలజడులు చెలరేగినప్పుడు వారితో పోలీసులను రాళ్లతో కొట్టించేందుకు ప్రయత్నిస్తున్నారని కూడా స్థానిక పోలీసు అధికారి ఒకరు మీడియాతో తెలిపారు. తాజాగా ఎన్‌కౌంటర్ ఘటన జరగడం వల్ల ఆ ప్రాంతం గుండా వెళ్లే బారాముల్లా-కాజీగుండ్ రైలు సర్వీసులను నిలిపివేయమని తెలిపినట్లు పోలీసులు తెలిపారు.
Recruitment&no.of local terrorists has been rising. In South Kashmir, approx no.of terrorists is 200, out of which maybe 15% are foreign terrorists.We're doing ops to cut down no.of active terrorists&reduce recruitment of new terrorists: Brigadier Sachin Malik on Kulgam encounter pic.twitter.com/l7Vk7K8OwJ
— ANI (@ANI) September 15, 2018