Maharashtra Political Crisis: మహారాష్ట్ర రాజకీయ సంక్షోభం మలుపులు తిరుగుతూనే ఉంది. సుప్రీం కోర్టుకు చేరిన శివసేన పంచాయతీపై జూలై 11కి విచారణ వాయిదా పడింది. డిప్యూటీ స్పీకర్ ఇచ్చిన అనర్హత నోటీసులపై సుప్రీం కోర్టు స్టేటస్ కో ఆర్డర్ ఇవ్వడంతో ఏక్‌నాథ్ షిండే రెబల్ క్యాంపుకు భారీ ఊరట లభించినట్లయింది. సుప్రీం విచారణకు మరో 13 రోజుల గడువు ఉండటంతో ఈలోగా మహా రాజకీయం ఏ మలుపు తీసుకుంటుందోనన్న ఉత్కంఠ నెలకొంది. మరోవైపు, ముఖ్యమంత్రి ఉద్ధవ్ ఠాక్రే ఇక ఆ పదవిలో కొనసాగేందుకు సుముఖంగా లేరని తెలుస్తోంది. ఇప్పటికే రెండుసార్లు రాజీనామాకు సిద్ధపడి వెనక్కి తగ్గినట్లుగా కథనాలు వస్తున్నాయి.
విశ్వసనీయ సమాచారం ప్రకారం.. పార్టీలో తిరుగుబాటుతో ఉద్ధవ్ ఠాక్రే జూన్ 21న రాజీనామాకు సిద్ధపడ్డారు. ఏక్‌నాథ్ షిండే నేత్రుత్వంలోని రెబల్ క్యాంప్ సూరత్‌కు మకాం మార్చిన రోజే రాజీనామా ప్రకటించాలని నిర్ణయించుకున్నారు. ఫేస్‌బుక్ లైవ్ స్ట్రీమ్ ద్వారా ఈ విషయాన్ని తెలియజేయాలనుకున్నారు. కానీ ఎన్‌సీపీ చీఫ్ శరద్ పవార్ ఉద్ధవ్ ఠాక్రేని వారించారు. ఆ నిర్ణయాన్ని ఉపసంహరించుకునేలా చేశారు.
ఆ మరుసటిరోజే ఠాక్రే మరోసారి రాజీనామాకు సిద్ధపడ్డారు. దీనిపై అధికార యంత్రాంగానికి కూడా కబురు పెట్టారు. సాయంత్రం 4గంటలకు ఫేస్‌బుక్ లైవ్ ద్వారా రాజీనామాపై ప్రకటన చేయాలనుకున్నారు. కానీ మళ్లీ శరద్ పవార్ జోక్యం చేసుకొని ఉద్ధవ్ ఠాక్రే తన నిర్ణయాన్ని మార్చుకునేలా చేశారు. ఇలాంటి క్లిష్ట పరిస్థితుల్లో వ్యూహాత్మకంగా ముందుకు సాగాలని.. ముందే చేతులెత్తేయొద్దని పవార్ ఠాక్రేకి సూచించినట్లు తెలుస్తోంది. దీంతో వెనక్కి తగ్గిన ఠాక్రే.. ఆరోజు అరగంట ఆలస్యంగా 4.30గంటలకు ఫేస్‌బుక్ లైవ్‌కి వచ్చారు. తాను రాజీనామా లేఖతో సిద్దంగా ఉన్నానని... అయితే రెబల్ ఎమ్మెల్యేల్లో ఒక్కరైనా తనపై నేరుగా ఫిర్యాదు చేస్తే రాజీనామా చేస్తానని ప్రకటించారు. అదే రోజు సీఎం క్యాంపు కార్యాలయం నుంచి తన ఇంటికి షిఫ్ట్ అయ్యారు.
శివసేనకు మొత్తం 55 మంది ఎమ్మెల్యేలు ఉండగా ప్రస్తుతం ఇందులో 40 మంది ఏక్‌నాథ్ షిండే రెబల్ క్యాంపులో ఉన్నారు. షిండే తిరుగుబాటుతో మహా వికాస్ అఘాడీ ప్రభుత్వం ఉంటుందా కుప్పకూలుతుందా అన్న దానిపై ఉత్కంఠ నెలకొంది. ఇప్పటికైతే ఈ వ్యవహారం సుప్రీం కోర్టులో ఉన్నప్పటికీ.. గవర్నర్ జోక్యం చేసుకునే అవకాశం లేకపోలేదు. ఒకవేళ గవర్నర్ బల నిరూపణకు ఆదేశిస్తే ఏక్‌నాథ్ షిండే బీజేపీతో చేతులు కలుపుతారనే ప్రచారం జరుగుతోంది. అదే జరిగితే మహారాష్ట్రలో మళ్లీ బీజేపీ ప్రభుత్వం ఏర్పడటం ఖాయమనే చెప్పాలి.
Also Read: Horoscope Today June 28th: నేటి రాశి ఫలాలు.. ఇవాళ ఈ రాశుల వారికి ఆర్థికంగా కలిసొస్తుంది..
Also Read: Rythu Bandhu: తెలంగాణ రైతులకు గుడ్‌న్యూస్..రేపే అన్నదాతల ఖాతాల్లోకి సాయం..!
స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee హిందుస్థాన్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.
Android Link - https://bit.ly/3hDyh4G
Apple Link - https://apple.co/3loQYe
Twitter , Facebookమా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి