హెల్మెట్ ధరించని ద్విచక్రవాహనదారులకు తమ బంకుల్లో పెట్రోల్ పోయరాదని తెలంగాణ జైళ్లశాఖ నిర్ణయించింది. ఈ మేరకు జైళ్లశాఖ నూతన నిబంధనను అమల్లోకి తీసుకొచ్చింది. జైళ్లశాఖ ఆధ్వర్యంలో నడిచే 13 పెట్రోల్ బంకుల్లో బుధవారం నుంచే ఇది అమల్లోకి వచ్చినట్లు తెలిపిన అధికారులు.. త్వరలో అందుబాటులోకి రానున్న మరో 8 బంకుల్లోనూ ఈ నిబంధన అమలు చేస్తామన్నారు. ఇకపై తెలంగాణ జైళ్లశాఖ ఆధ్వర్యంలో కొనసాగుతున్న పెట్రోల్ బంకుల్లో హెల్మెట్ ఉంటేనే పెట్రోల్ పోస్తారు. ఇందుకు సంబంధించిన ఆదేశాలను జైళ్లశాఖ డీజీ వీకే సింగ్ మంగళవారం జారీచేశారు.
ఖైదీలకు పునరావాసం కల్పించే కార్యక్రమాల్లో భాగంగా జైళ్లశాఖ పెట్రోల్ పంప్‌లను అందుబాటులోకి తెచ్చింది. వాహనదారులు పెట్రోల్ కావాలంటే తప్పకుండా హెల్మెట్ ధరించి రావాలని సూచించారు. ఇదే విధానాన్ని రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న పెట్రోల్ బంకులు పాటించాలని విజ్ఞప్తి చేస్తామన్నారు.
రోడ్డు ప్రమాదాల్లో ఎక్కువమంది హెల్మెట్ ధరించకపోవడం వల్లే ప్రాణాలు కోల్పోతున్నారని అన్నారు. ఈ విషయాన్ని దృష్టిలో ఉంచుకొని వారిలో మార్పు రావాలనే ఉద్దేశంతోనే సామాజిక బాధ్యతగా ఈ నిర్ణయం తీసుకున్నట్టు ఓ ప్రకటనలో జైళ్లశాఖ డీజీ వీకే సింగ్ తెలిపారు.