టీడీపీతో పొత్తు అంశంపై కాంగ్రెస్ సీనియర్ నేత తులసిరెడ్డి స్పందించారు. ఎన్నికల్లో టీడీపీతో కాంగ్రెస్ జతకడుతుందని వస్తున్న వార్తల్లో వాస్తవం లేదన్నారు. వాస్తవానికి టీడీపీ, వైసీపీల విధానాలు ఒకటేనని..ఎన్నికల తర్వాత ఆ రెండు పార్టీలు బీజేపీ పంచన చేరడం ఖాయమని ఆయన జోస్యం చెప్పారు. బీజేపీకి టీడీపీ అధికారిక మిత్రపక్షమైతే..వైసీపీ అనధికార మిత్రపక్షంగా వ్యవహరిస్తుందని ఆరోపించారు. ఎన్నికల కోసమే బీజేపీకి దూరంగా ఉంటునట్లు ఆ రెండు పార్టీలు డ్రామాలు ఆడుతున్నాయని విమర్శించారు. ఈ సందర్భంగా తులసీ రెడ్డి స్పందిస్తూ టీడీపీ తన పేరును 'తెలుగు ద్రోహుల పార్టీ'గాను.. వైసీపీని నకిలీ కబ్జాకోరు పార్టీగా మార్పుకోవాలని ఎద్దేవ చేశారు.
ఇటీవలి రాజకీయ పరిణామాలు చూసి టీడీపీ, కాంగ్రెస్ పార్టీలు జతకడతాయని జోరుగా వార్తలు వినిపిస్తున్నాయి. పరస్పర అవసరాల కోసం ఇరు పార్టీలు జతకట్టినా ఆశ్చర్యపోవాల్సిన అవసరం లేదని అభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి. ఇదే తరుణంలో కర్నాటకలో కాంగ్రెస్ -జేడీఎస్ ప్రభుత్వ ఏర్పాటు సమయంలో చంద్రబాబును ఆహ్వానించడం.. అక్కడికి చంద్రబాబు వెళ్లిరావడంతో ఈ ఊహాగానాలకు మరింత బలాన్ని ఇచ్చాయి. దీంతో కాంగ్రెస్ టీడీపీ దోస్తీ ఉంటుందని జోరుగా ప్రచారం జరుగుతోంది. ఈ నేపథ్యంలో కాంగ్రెస్ సీనియర్ నేత తులసీరెడ్డి ఈ అంశంపై స్పందించారు.