అమరావతి: ఏపీలో మధ్యాహ్న భోజనం పథకం పేరు మారింది. ఇకపై ఈ పథకాన్ని వైఎస్ఆర్ అక్షయపాత్రగా మార్చుతున్నట్టు ఏపీ నూతన సర్కార్ స్పష్టంచేసింది. అక్షయపాత్ర ట్రస్ట్ ప్రతినిధులు, సంబంధిత అధికార యంత్రాంగంతో మధ్యాహ్న భోజనం పథకంపై సమీక్ష జరిపిన సీఎం జగన్.. ప్రభుత్వ పాఠశాలల్లో విప్లవాత్మకమైన మార్పులు తీసుకురావాల్సిందిగా అధికారులకు సూచించారు. ప్రతీ విద్యార్థి ప్రభుత్వ పాఠశాలలో చదువుకునేందుకు ఆసక్తి కనబర్చేలా పాఠశాలల్ని తీర్చిదిద్దాలని జగన్ అధికారులను ఆదేశించారు. వేసవి సెలవుల అనంతరం పాఠశాలల పునఃప్రారంభానికి ఇంకెన్నో రోజులు లేని నేపథ్యంలో వెంటనే పాఠశాలల్లో మౌలిక వసతులు ఏర్పాటు చేయాలని అన్నారు.
మధ్యాహ్న భోజనం నాణ్యతలో రాజీపడొద్దని చెబుతూ ఇకపై మధ్యాహ్న భోజనం పథకం బాధ్యతలను నిర్వర్తిస్తోన్న ఏజెన్సీలకు గౌరవవేతనం రూ.3వేలకు పెంచనున్నట్టు తేల్చిచెప్పారు. పాఠశాలల్లో సకల సదుపాయాలు కలిగిన వంటశాలలు నిర్మించాలని తెలిపారు. నేడు నిర్వహించిన సమీక్షా సమావేశం ఆరంభం మాత్రమేనని.. తర్వాతి సమావేశం నాటికి పూర్తిస్థాయి ప్రణాళికలతో రావాలని జగన్ అధికారులను ఆదేశించారు.