Alluri Movie Review : శ్రీవిష్ణు అల్లూరి సినిమా ఫస్ట్ రివ్యూ.. సినిమా ఎలా ఉందంటే?

Sree Vishnu's Alluri Movie Telugu Review:  శ్రీ విష్ణు స తాజాగా అల్లూరి అనే సినిమాతో తెలుగు ప్రేక్షకుల ముందుకు వచ్చాడు. ప్రేక్షకులలో ఏర్పడిన అంచనాలను ఈ సినిమా అందుకుందా? లేదా? అనేది సినిమా రివ్యూలో చూద్దాం. 

Written by - Chaganti Bhargav | Last Updated : Sep 23, 2022, 07:10 PM IST
Alluri Movie Review : శ్రీవిష్ణు అల్లూరి సినిమా ఫస్ట్ రివ్యూ.. సినిమా ఎలా ఉందంటే?

 

Sree Vishnu's Alluri Movie Telugu Review: హీరో శ్రీ విష్ణు సరైన హిట్టు అందుకుని చాలా కాలమే అయింది. తాజాగా ఆయన అల్లూరి అనే సినిమాతో తెలుగు ప్రేక్షకుల ముందుకు వచ్చాడు. కొన్ని అనివార్య కారణాలతో ఉదయం పడాల్సిన షోలు క్యాన్సిల్ అయినా మధ్యాహ్నం నుంచి తెలుగు రాష్ట్రాల్లో సినిమా విడుదలైంది. శ్రీ విష్ణు తొలిసారిగా ఒక పోలీసు అధికారి పాత్రలో నటిస్తూ ఉండడంతో పాటు టీజర్, ట్రైలర్స్ సినిమా మీద ప్రేక్షకుల్లో అంచనాలు ఏర్పడేలా చేశాయి. మరి ప్రేక్షకులలో ఏర్పడిన అంచనాలను ఈ సినిమా అందుకుందా? లేదా? అనేది సినిమా రివ్యూలో చూద్దాం. 

అల్లూరి కథ:
అల్లూరి సినిమా అల్లూరి సీతారామరాజు అనే ఒక పోలీస్ అధికారి బయోపిక్ అనే చెప్పాలి. అయితే ఆ అల్లూరి సీతారామరాజు ఒక కల్పిత పాత్రధారి. అల్లూరి సీతారామరాజు(శ్రీ విష్ణు) అనే ఒక సబ్ ఇన్స్పెక్టర్ జీవితం ఎలా మొదలై, ఎలా ముగిసింది అనే విషయాలను ఆసక్తికరంగా తెరమీద ఆవిష్కరించే ప్రయత్నం చేశాడు దర్శకుడు. కొత్తవలస పోలీస్ స్టేషన్ కి సబ్ ఇన్స్పెక్టర్ గా వెళ్లిన అల్లూరి సీతారామరాజు మొదటి రోజే డ్యూటీలో నిజాయితీగా ఉండి మిగతా పోలీస్ అధికారులు అందరికీ షాక్ ఇస్తాడు. ఎవరి మాటా వినకపోవడంతో సుమారు ఆరేడు పోలీస్ స్టేషన్లకు ట్రాన్స్ఫర్ అయిన తర్వాత విశాఖపట్నం టూ టౌన్ పోలీస్ స్టేషన్ కి ఇన్స్పెక్టర్గా ఛార్జ్ తీసుకుంటాడు. అక్కడ ఒక ఎంపీ కుమారుడి అకృత్యాలు చూడలేక చంపేయడంతో ట్రాఫిక్ డిపార్ట్మెంట్ కి డీమోట్  చేయబడతాడు. అక్కడి నుంచి హైదరాబాద్ ట్రాన్స్ఫర్ అయిన అల్లూరి సీతారామరాజు అనూహ్యంగా పాతబస్తీలో ఒక టెర్రరిస్ట్ మూకతో తలపడతాడు. ఆ టెర్రరిస్ట్ గ్యాంగ్ మొత్తాన్ని అల్లూరి అంతమొందించాడా? టెర్రరిస్ట్ గ్యాంగ్ తో పోరాడుతున్న సమయంలో అల్లూరికి ఏమైంది? అనేది ఈ సినిమా కథ.

విశ్లేషణ
ఒక నిజాయితీ గల పోలీసు అధికారి, అతని నిజాయితీ చుట్టూ అల్లుకున్న కథలతో తెలుగులో చాలా సినిమాలు వచ్చాయి. ఈ సినిమా కూడా దాదాపుగా అదే కోవలో సాగుతుంది. డ్యూటీ కోసం ప్రాణం ఇచ్చే అల్లూరి సీతారామరాజు ఎలా ఇతర పోలీసులకు ఆదర్శంగా నిలిచాడు ? ఎలా యువతలో స్ఫూర్తినింపాడు? అనే విషయాన్ని ఆవిష్కరించడానికి దర్శకుడు శతవిధాలా ప్రయత్నం చేసి దాదాపుగా సఫలం అయ్యాడు. అల్లూరి సీతారామరాజు అనే పోలీసు అధికారి పాత్రలో శ్రీ విష్ణు జీవించాడు. అయితే సినిమా స్క్రీన్ ప్లే మాత్రం చాలా స్లోగా సాగుతున్నట్లు అనిపిస్తుంది. ఒకానొక సమయంలో ఇంటర్వెల్ కే సినిమా ముగిసిందా అనిపిస్తుంది. కానీ అసలు కథ ఇంటర్వెల్ తర్వాతే మొదలవుతుంది. నిజాయితీగా బతికే పోలీస్ అధికారులు, పోలీస్ అధికారుల కుటుంబాలు బాగా కనెక్ట్ అయ్యే కథ ఇది. సినిమాలో శ్రీ విష్ణు ఎంట్రీ, నటన, డైలాగ్ డిక్షన్ అలాగే హీరోయిన్ అందాల ప్రదర్శన బాగా ప్లస్ అవుతాయి. ఇంటర్వెల్ కూడా ఆసక్తికరమైన ట్విస్టుతో ప్లాన్ చేశారు. సెకండ్ హాఫ్ డైలాగులు ప్రేక్షకుల మదిని  తట్టే విధంగా ఉంటాయి. సినిమా ఆఖరు 30 నిమిషాల పాటు ప్రేక్షకులు ఆద్యంతం ఆసక్తికరంగా ఎటూ కదలకుండా సినిమా మాత్రమే చూసేలాగా స్క్రీన్ ప్లే రాసుకున్నాడు దర్శకుడు. కాకపోతే క్లైమాక్స్ కాస్త ప్రేక్షకులందరికీ కంటతడి పెట్టించే విధంగా ఉంటుంది..
 
నటీనటుల విషయానికి వస్తే 
నటీనటుల విషయానికి వస్తే శ్రీ విష్ణు ఎప్పటిలాగే తన న్యాచురల్ యాక్టింగ్ తో అదరగొట్టాడు. వేరే ఏదైనా పెద్ద హీరోకి ఈ సినిమా పడి ఉంటే వేరే లెవల్ కి వెళ్ళేది, కానీ శ్రీ విష్ణు విషయంలో ఎలివేషన్స్ ఇవ్వలేక కొంతవరకు దర్శకుడు సంయమనం పాటించినట్లు అనిపిస్తుంది. హీరోయిన్ కేవలం అందాల ప్రదర్శనకు మాత్రమే పరిమితమైంది. ఆమె పాత్రకు నటించే స్కోప్ దక్కలేదు. సినిమాలో తనికెళ్ల భరణి పాత్ర ప్రేక్షకులను ఆకట్టుకుంటుంది. అలాగే సుమన్ సహా మరికొందరు నటీనటులు తమ పాత్రల పరిధి మీద నటించి ఆకట్టుకున్నారు. 

టెక్నికల్ టీం విషయానికి వస్తే
టెక్నికల్ టీం విషయానికి వస్తే దర్శకుడు ప్రదీప్ వర్మకు ఈ సినిమా మొదటి సినిమానే అయినా ఎక్కడ మొదటి సినిమా అనే భావన రాకుండా చాలా చక్కగా తెరకెక్కించాడు. మ్యూజిక్ డైరెక్టర్ హర్షవర్ధన్ రామేశ్వర్ అందించిన సంగీతం ప్రేక్షకులను ఆకట్టుకోకపోయినా ఆయన అందించిన నేపథ్య సంగీతం మాత్రం ప్రేక్షకులకు బాగా కనెక్ట్ అవుతుంది. నిర్మాత బెక్కం వేణుగోపాల్ నిర్మాణ విలువలు బాగున్నాయి. రాజు తోట సినిమాటోగ్రఫీ సినిమాకు అదనపు అందాన్ని తీసుకొచ్చింది. అయితే ఎడిటింగ్ టేబుల్ మీద మరి కాస్త కత్తెరకు పని పెట్టాల్సింది. సినిమా బాగా సాగ తీసిన ఫీలింగ్ కలుగుతుంది.
 
ఫైనల్ గా
ఫైనల్ గా ఒక్క మాటలో చెప్పాలంటే ఒక నిజాయితీ గల పోలీస్ అధికారికి ఇచ్చిన ట్రిబ్యూట్ లాగా అనిపిస్తుంది. హింస పాళ్లు కాస్త ఎక్కువే కావడంతో ఫ్యామిలీతో కలిసి చూడలేరు. రక్షణ శాఖలను ఇష్టపడే వారు, మాస్ మూవీస్ ఇష్టపడేవారికి బాగా కనెక్ట్ అయ్యే సినిమా ఇది.  

Rating: 3/5

బ్యానర్: లక్కీ మీడియా
దర్శకుడు: ప్రదీప్ వర్మ
నిర్మాత: బెక్కెం వేణు గోపాల్
సహ నిర్మాత: బెక్కెం బబిత
సంగీత దర్శకుడు: హర్షవర్ధన్ రామేశ్వర్
సినిమాటోగ్రఫీ - రాజ్ తోట
ఎడిటర్: ధర్మేంద్ర కాకరాల
ఆర్ట్ డైరెక్టర్: విఠల్ కొసనం
ఫైట్స్: రామ్ క్రిషన్
 

Trending News