Delhi Liquor Scam:లిక్కర్ స్కాంతో కవిత ,రేవంత్ రెడ్డి వ్యాపార బంధం బయటపడిందా? ఒకే దెబ్బకు రెండు పిట్టల్లా బీజేపీ మాస్టర్ స్ట్రోక్?

Delhi Liquor Scam: ఎమ్మెల్సీ కవిత, పీసీసీ చీఫ్ రేవంత్ రెడ్డి మధ్య వ్యాపార బంధం ఉందనే ఆరోపణలు ఉద్యమ కాలం నుంచి ఉన్నాయి, అయితే ఆ ఇద్దరు నేతలు వాటిని ఖండిస్తూ వచ్చారు. కాని తాజాగా వెలుగుచూసిన లిక్కర్ స్కాంతో కవిత, రేవంత్ రెడ్డి వ్యాపార బంధాలు బయటికి వచ్చాయని అంటున్నారు. 

Written by - Srisailam | Last Updated : Sep 7, 2022, 10:30 AM IST
  • ఢిల్లీ లిక్కర్ స్కాంలో ఈడీ దూకుడు
  • హైదరాబాద్ లో ముమ్మర సోదాలు
  • కవిత, రేవంత్ రెడ్డి టార్గెట్?
Delhi Liquor Scam:లిక్కర్ స్కాంతో కవిత ,రేవంత్ రెడ్డి వ్యాపార బంధం బయటపడిందా? ఒకే దెబ్బకు రెండు పిట్టల్లా బీజేపీ మాస్టర్ స్ట్రోక్?

Delhi Liquor Scam:దేశ వ్యాప్తంగా సంచలనంగా మారిన ఢిల్లి లీక్కర్ స్కాం తెలంగాణ రాజకీయాలను షేక్ చేస్తోంది. లిక్కర్ స్కాంలో తెలంగాణకు చెందిన మద్యం వ్యాపారులే కీలక పాత్ర పోషించగా.. ముఖ్యమంత్రి కేసీఆర్ కూతురు, ఎమ్మెల్సీ కవిత హస్తం ఉందంటూ ఢిల్లీ బీజేపీ ఎంపీ ఆరోపణలు చేయడం కలకలం రేపింది. ఈ కేసులో ఢిల్లీ ఉప ముఖ్యమంత్రి మనీస్ సిసోడియా సహా 14 మందిపై  సీబీఐ చార్జీషీట్ నమోదు చేసింది. అయితే లిక్కర్ స్కాంలో తనపై బీజేపీ ఎంపీ చేసిన ఆరోపణలను కవిత ఖండించారు. కేసీఆర్ కూతురిని కాబట్టే తనను టార్గెట్ చేశారని ఆరోపించారు. ఈ కేసులో ఎలాంటి విచారణకైనా సిద్ధమన్నారు. అంతేకాదు తనపై ఆరోపణలు చేసిన ఇద్దరు బీజేపీ నేతలపై పరువు నష్టం దావా వేశారు కవిత. అయితే కవిత కేసుపై స్పందించిన బీజేపీ నేతలు.. త్వరలోనే లిక్కర్ స్కాంతో సంబంధం ఉన్న అందరికి నోటీసులు వస్తాయని చెప్పారు. దీంతో కవిత టార్గెట్ గా ఢిల్లీ బృందాలు రంగంలోకి దిగబోతున్నాయనే చర్చ సాగింది.

కొన్ని రోజులుగా జరుగుతున్న చర్చే నిజమైంది. లిక్కర్ స్కాంలో ఈడీ రంగంలోకి దిగింది. ఏకంగా 25 బృందాలతో హైదరాబాద్ లో దాడులు నిర్వహించింది. లిక్కర్ కుంభకోణం కేసులో విచారణలో భాగంగా సూదిని సృజన్ రెడ్డి, బోయిన పల్లి అభిషేక్ రావు, గండ్ర ప్రేమ్ సాగర్ ఇళ్ళలో ఈడీ  సోదాలు జరిగాయి.ఇదే ఇప్పుడు సంచలనమైంది. ఈడీ సోదాలు జరిగిన బోయినపల్లి అభిషేక్ రావు ఎమ్మెల్సీ కవితకు అత్యంత సన్నిహితుడు. దీంతో లిక్కర్ స్కాంలో కవిత లింకులు తేల్చడానికే కేంద్రం ఈడీని రంగంలోకి దించిందని అంటున్నారు. ఇక్కడ మరో కీలక అంశం ఉంది. ఈడీ సోదాలు జరిగిన సూదిని సృజన్ రెడ్డి కూడా కవితకు సన్నిహితుడే. ఈ సృజన్ రెడ్డి ఎవరో కాదు తెలంగాణ పీసీసీ చీఫ్ రేవంత్ రెడ్డికి స్వయానా బావమరిది. కేంద్ర మాజీ మంత్రి సూదిని జైపాల్ రెడ్డి సోదరుడి కూతురే రేవంత్ రెడ్డి భార్య. లిక్కర్ స్కాంలో ఈడీ సోదాలు జరిగిన సూదిన సృజన్ రెడ్డి.. రేవంత్ రెడ్డి భార్య సోదరుడే. దీంతో లిక్కర్ స్కాంలో ఎమ్మెల్సీ కవితతో పాటు పీసీసీ చీఫ్ రేవంత్ రెడ్డికి లింకులు ఉన్నాయనే ఆరోపణలు వస్తున్నాయి. 

ఎమ్మెల్సీ కవిత, పీసీసీ చీఫ్ రేవంత్ రెడ్డి మధ్య వ్యాపార బంధం ఉందనే ఆరోపణలు ఉద్యమ కాలం నుంచి ఉన్నాయి, అయితే ఆ ఇద్దరు నేతలు వాటిని ఖండిస్తూ వచ్చారు. కాని తాజాగా వెలుగుచూసిన లిక్కర్ స్కాంతో కవిత, రేవంత్ రెడ్డి వ్యాపార బంధాలు బయటికి వచ్చాయని అంటున్నారు. సూదిని సృజన్ రెడ్డి, ఎమ్మెల్సీ కవితలు అడికోర్ ఇన్ఫ్రాస్టక్చర్ ప్రైవేట్ లిమిటెడ్ కంపెనీలో ఒకప్పుడు డైరెక్టర్లుగా ఉన్నట్లు ఆధారాలు లభించాయి. 2010లో ఏర్పాటైన అడికోర్ ఇన్ఫ్రాస్టక్చర్ ప్రైవేట్ లిమిటెడ్ కంపెనీలో కల్వకుంట్ల కవితతో పాటు సూదిని సృజన్ రెడ్డి డైరెక్టర్లుగా ఉన్నారు. 

2010లో మొదటగా ఈ సంస్థలో నలుగురు డైరెక్టర్లు ఉన్నారు. ఎమ్మెల్సీ కవిత, వినూత మందుల, అనుముల రేవంత్ రెడ్డి, సృజన్ సూదిని డైరెక్టర్లుగా ఉన్నారు. తర్వాత కొంత కాలానికి రేవంత్ రెడ్డి, వినూత మందుల తప్పుకున్నారు. 2012 వరకు కవిత, సృజన్ రెడ్డి ఆధ్వర్యంలో కంపెనీ కార్యకలాపాలు జరిగాయి. రాజకీయంగా ఇబ్బంది వస్తుందనే రేవంత్ రెడ్డి తప్పుకుని.. ఆ సంస్థ బాధ్యతలు తన బావమరిది అప్పగించారనే ఆరోపణలు వస్తున్నాయి. 

రిజిస్టర్ ఆఫ్ కంపెనీస్ దగ్గర 2012 మార్చి 31న అడికోర్ సంస్థకు సంబంధించి లాస్ట్ ఫిల్లింగ్ ఉంది. రాజకీయ కారణాలతో అడికోర్ సంస్థ యాక్టివ్ గా లేకపోయినా... కవిత , సృజన్ రెడ్డి మధ్య ఇతరత్రా వ్యాపార సంబంధాలు కొనసాగుతున్నాయని అంటున్నారు. సూదిని సృజన్ కు లిక్కర్ తయారీ సంస్థల్లో వాటాలు ఉన్నాయని.. ఆ సంస్థలే ఢిల్లీ లిక్కర్ స్కాంలో ఉన్నాయని అంటున్నారు. ఈ కంపెనీల విషయంలోనే ఎమ్మెల్సీ కవిత లింకులు బయటికి రాబోతున్నాయనే ప్రచారం కేంద్ర ప్రభుత్వ వర్గాల నుంచి వస్తోంది. 

ఢిల్లీ లిక్కర్ స్కాంలో బీజేపీ పెద్దలు పక్కా స్కెచ్ వేశారని అంటున్నారు. కేంద్ర సర్కార్ ను టార్గెట్ చేసిన సీఎం కేసీఆర్ ఫ్యామిలీ అవినితీకి బయటికి తీయడంతో పాటు తెలంగాణలో తమకు మరో ప్రధాన శత్రువైన రేవంత్ రెడ్డిని ఇరికించేలా స్కెచ్ వేశారని అంటున్నారు. ఒకే దెబ్బకు రెండు పిట్టల్లా అటు కేసీఆర్, ఇటు రేవంత్ రెడ్డి బుక్ కాబోతున్నారని బీజేపీ వర్గాలు చెబుతున్నాయి. ఢిల్లీ లిక్కర్ స్కాంతో కేసీఆర్ కుటుంబం తమకు రాజకీయంగా శత్రువులుగా ఉన్నవాళ్లతోనే వ్యాపార సంబంధాలు కొనసాగిస్తుందనే విషయం తెలంగాణ ప్రజలకు బహిర్గతం చేసేలా బీజేపీ పక్కా వ్యూహం వేసిందని అంటున్నారు. ఢిల్లీ లిక్కర్ స్కాం  విచారణలో తెలంగాణకు సంబంధించి ముందు ముందు మరిన్ని సంచలన అంశాలు బయటికి రాబోతున్నాయని అంటున్నారు. చూడాలి మరీ ఇంకా ఏం జరగబోతుందో... 

Read Also: Rahul Bharat Jodo Yatra: నేటి నుంచే రాహుల్ గాంధీ 'భారత్ జోడో యాత్ర'... కన్యాకుమారి నుంచి కశ్మీర్ వరకు... 150 రోజులు 3500 కి.మీ

Read Also: NEET UG 2022 Result: నేడే నీట్ యూజీ 2022 ఫలితాలు... విద్యార్థులు రిజల్ట్స్ ఇలా చెక్ చేసుకోండి...

స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.  

Android Link - https://play.google.com/store/apps/details?id=com.indiadotcom.zeetelugu

Apple Link - https://apps.apple.com/in/app/zee-telugu-news/id1633190712

మా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి Twitter , Facebook

Trending News