Attack On Pithapuram Varma: కూటమిలో కుమ్ములాట మొదలు.. పిఠాపురంలో వర్మపై జనసైనికులు దాడి

Pithapuram Ex MLA SVSN Varma: ఏపీలో ప్రభుత్వం ఏర్పాటుకాకముందే కూటమిలో కుమ్ములాట మొదలైంది. పవన్‌ కోసం సీటు త్యాగం చేసిన వర్మపైనే జనసేన పార్టీ నాయకులు దాడి చేశారు.  

Written by - Ravi Kumar Sargam | Last Updated : Jun 7, 2024, 11:15 PM IST
Attack On Pithapuram Varma: కూటమిలో కుమ్ములాట మొదలు.. పిఠాపురంలో వర్మపై జనసైనికులు దాడి

Pithapuram Ex MLA SVSN Varma: ఆంధ్రప్రదేశ్‌ భవిష్యత్‌కు కీలకమైన ఎన్నికల్లో తెలుగుదేశం, బీజేపీ, జనసేన పార్టీలు కలిసి పోటీ చేసి అద్భుతమైన మెజార్టీతో విజయం సాధించాయి. అయితే ప్రభుత్వం ఇంకా ఏర్పాటుకాక ముందే కూటమిలో కుమ్ములాట మొదలైంది. జనసేన అధినేత పవన్‌ కల్యాణ్ కోసం తన సీటు త్యాగం చేసిన ఎస్‌వీఎస్‌ఎన్‌ వర్మపైనే జనసేన కార్యకర్తలు దాడులకు పాల్పడ్డారు. అధికారం కోల్పోయిన వైఎస్సార్‌ కాంగ్రెస్‌ పార్టీ శ్రేణులపై టీడీపీ దాడులు చేస్తుండగా.. జనసేన మాత్రం తన మిత్రపక్ష పార్టీపై దాడి చేయడం కలకలం రేపింది.

వివాదం ఇక్కడే..
గొల్లప్రోలు మండలం వన్నెపూడి గ్రామానికి చెందిన వైఎస్సార్‌ కాంగ్రెస్‌ పార్టీ సర్పంచ్‌ను తెలుగుదేశం పార్టీలో చేర్చుకునేందుకు శుక్రవారం సాయంత్రం వర్మ ఆ గ్రామానికి వెళ్లారు. అయితే వర్మ రాకను జనసేన పార్టీ కార్యకర్తలు, నాయకులు అడ్డుకున్నారు. అంతేకాకుండా ఒక్కసారిగా వర్మ వాహనాలపై విరుచుకుపడ్డారు. రాళ్లు, కర్రలతో వర్మకు సంబంధించిన వాహనాలు, అనుచరులపై దాడులకు పాల్పడ్డారు. దాడిలో పది మందికి పైగా గాయపడ్డట్లు తెలుస్తోంది.

అయితే వర్మ కారులో ఉన్న సమయంలోనే జన సైనికులు రెచ్చిపోయారు. అయితే వర్మను కార్యకర్తలు, నాయకులు కాపాడుకున్నారు. ఈ సంఘటనపై వర్మ తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. పార్టీ మండల అధ్యక్షుడిపై దాడులు జరిగాయని వర్మ తెలిపారు. ఎందుకు దాడులు జరుగుతున్నాయో తనకు తెలియదని పేర్కొన్నారు.

పిఠాపురంలో జనసేన అధ్యక్షుడు పవన్ కళ్యాణ్ గెలుపునకు వర్మ అలుపెరగని కృషి చేసిన విషయం తెలిసిందే. తన సీటును త్యాగం చేయడంతోపాటు ఎన్నికల ప్రచారంలో ప్రతి గడపకు వెళ్లి జనసేనకు ఓటు వేసి పవన్‌ను గెలిపించాలని ఓటర్లను కోరారు. ఆయన కృషితో వైఎస్సార్సీపీ అభ్యర్థి వంగా గీతపై పవన్ ఏకంగా 70 వేల మెజార్టీతో విజయం సాధించి తొలిసారి ఎమ్మెల్యేగా అసెంబ్లీలో అడుగుపెట్టనున్నారు. పవన్‌ను అఖండ మెజార్టీతో గెలిపించిన వర్మపై జనసైనికులు ఇలా దాడికి పాల్పడడం అన్యాయమని టీడీపీ నాయకులు అంటున్నారు. 
 

Trending News