Pawan Kalyan Speech in Varahi Yatra: సొంత బాబాయి హత్య కేసులో చేతికి రక్తపు మరకలు అంటుకున్న వ్యక్తి మనల్ని పాలిస్తున్నాడని జనసేన అధినేత పవన్ కళ్యాణ్ అన్నారు. చిన్నాయన కూతురు తన తండ్రి హత్యకు కారకులెవరో తెలియాలని పోరాడుతుంటే.. చంపిన వారిని వెనకేసుకొస్తున్న వారి పాలనలో మనం ఎంత భద్రంగా ఉన్నామో ప్రజలు ఆలోచించాలని కోరారు. వారాహి విజయ యాత్రలో భాగంగా బుధవారం తొలి బహిరంగ సభ కత్తిపూడిలో జరిగింది. ఈ సందర్భంగా పవన్ కళ్యాణ్ మాట్లాడుతూ.. అధికార మదంతో ఎన్ని అడ్డంకులు, ఎన్ని వ్యూహాలు పన్నినా.. వచ్చే సార్వత్రిక ఎన్నికల్లో జనసేన పార్టీ శాసనసభలో అడుగు పెట్టకుండా ఎవరూ ఆపలేరని ధీమా వ్యక్తం చేశారు. నిజాయతీ గల శాసన సభ్యులు చట్ట సభల్లో ప్రజా సమస్యలపై మాట్లాడితే ఎలా ఉంటుందో చూపిస్తామన్నారు. వచ్చే ఎన్నికలకు జనసేన పార్టీ ఒంటరిగా వస్తుందా..? ఉమ్మడిగా వస్తుందా..? అనే విషయాన్ని ఇంకా నిర్ణయించలేదని అన్నారు.
"ఆ రోజు వస్తే కచ్చితంగా ప్రజల మధ్యనే పారదర్శకంగా చెబుతాం. కుట్రలు, కుతంత్రాలతో గత ఎన్నికల్లో నేను ఓడిపోయాలా చేశారు. లక్షమంది ఓటర్లు ఉన్న భీమవరంలో 1.08 లక్షల ఓట్లు పోలయ్యాయి. ఇది కుట్ర కాకా ఇంకేంటి..? ఈ సారి అసెంబ్లీలో అడుగు పెట్టకుండా ఎవడు ఆపుతాడో నేను చూస్తాను. యాత్ర రథనానికి వారాహి అనే పేరు నేను కోరుకుంటే రాలేదు. నేను నిత్యం పూజించే ఆ తల్లి చల్లని దీవెనలు నా వెంట ఉన్నాయి కనుకే ఈ వాహనానికి వారాహి అనే పేరు వచ్చింది.
రాష్ట్ర భవిష్యత్తును తాకట్టు పెట్టి అప్పులు చేసి సంక్షేమం అంటున్నారు. ఇదేం తీరు..? అప్పులు చేసి గొప్పతనం అంటే ఎలా..? సంపద సృష్టికి రాష్ట్రంలో అపార అవకాశాలున్నా దాన్ని వినియోగించుకోకుండా, అప్పులు చేసి డబ్బులు పంచడం అంటే భవిష్యత్తును అంధకారంలోకి నెట్టేయడమే. జనసేన ప్రభుత్వంలో సంక్షేమ పథకాలు అద్భుతంగా ఉంటాయి. దానికి తగినట్లుగా రాష్ట్రంలో అన్నీ మార్గాల ద్వారా సంపదను పెంచి సంక్షేమాన్ని అద్భుతంగా అమలు చేసే బాధ్యతను తీసుకుంటాం. చెత్త పన్ను దగ్గర నుంచి రిజిస్ట్రేషన్ల ఫీజులు వరకు అన్నీ పన్నులు పెంచేశారు. ప్రజల దగ్గర వసూలు చేసిన డబ్బునే మళ్లీ పంచుతూ రాబిన్ హుడ్ లా ముఖ్యమంత్రి మాట్లాడటం చూస్తే నవ్వొస్తోంది.." అని జనసేనాని అన్నారు.
కొత్త పెళ్లి అయిన దంపతులకు పెళ్లి కానుక, షాదీ ముబారక్ వంటి పథకాలను వైసీపీ ప్రభుత్వం అమలు చేయలేదన్నారు పవన్ కళ్యాణ్. ఇటీవల పథకాలు అమలు చేస్తున్నా.. బోలెడు నిబంధనలు పెట్టారని అన్నారు. జనసేన ప్రభుత్వంలో కొత్తగా పెళ్లి చేసుకున్న జంటలకు పెళ్లి రిజిస్ట్రేషన్ ధ్రువపత్రంతో పాటు కొత్త రేషన్ కార్డు అందించేలా పథకం తీసుకొస్తామన్నారు. నవ దంపతులు కొత్త ఇల్లు నిర్మించుకోవాలని భావిస్తే.. తప్పనిసరిగా వారికి తగిన ప్రాధాన్యం ఇస్తామని అన్నారు. బీపీఎల్ వారికే కాకుండా కొత్త పెళ్లియిన వారందరికీ దీనిని వర్తింపజేస్తామని హామీ ఇచ్చారు.
"పాపం పసివాడా.. చిన్నాయనను చంపిందెవరో చెప్పు..? పాపం పసివాడులా మాట్లాడే ఈ ముఖ్యమంత్రి సొంత చిన్నాయనను చంపిన వారిని శతవిధాలా రక్షించేందుకు తాపత్రయ పడుతున్నారు. బాబాయి కూతురు న్యాయం పోరాటం చేస్తుంటే దాన్ని కనీసం పట్టించుకోని ఈయన క్లాస్ వార్ గురించి మాట్లాడుతుంటే వింతగా అనిపిస్తుంది. ప్రస్తుతం రాష్ట్రంలో రాజకీయ బలవంతుడు, రాజకీయ బలహీనుడు అనే రెండు వర్గాల మధ్యనే పోరు నడుస్తోంది. తన తండ్రిని హత్య చేసిన వారి కోసం న్యాయపోరాటం చేస్తున్న డాక్టర్ సుజాతకు కోర్టులో కనీసం వాదించేందుకు అడ్వకేట్లు దొరకని పక్షంలో సొంతంగా కేసు వాదించుకుంటూ వ్యవస్థలోని రాజకీయ బలవంతానికి సజీవ సాక్షిగా నిస్సహాయంగా నిలబడిపోయింది. కేసులో అన్నీ చేతులు సీఎం ఇంటి వైపే చూపిస్తున్నాయి. అయినా న్యాయం అందని పరిస్థితి. కోట్లాది మంది అభిమానులు ఉన్న వారిని సైతం ముఖ్యమంత్రి ఎదుట చేతులు కట్టుకునేలా చేసి, సీఎం క్లాస్ వార్ గురించి మట్లాడటానికి సరిపోరు.." అని పవన్ కళ్యాణ్ విమర్శించారు. ప్రజా సమస్యల కోసం వీధి పోరాటాలు చేశామని.. మీ కోసం చట్టసభల్లో పోరాడే అవకాశం ఇవ్వాలని జనసేనాని కోరారు.
Also Read: Earthquake In Delhi: భారీ భూకంపం.. ఇళ్ల నుంచి బయటకు జనం పరుగులు
Also Read: Cyclone Biparjoy: దూసుకువస్తున్న బిపోర్ జాయ్ తుఫాన్.. ఎఫెక్ట్ ఎక్కడంటే..?
స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.
ఆండ్రాయిడ్ లింక్ - https://bit.ly/3P3R74U
ఆపిల్ లింక్ - https://apple.co/3loQYe
Twitter, Facebookమా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి