YS Sharmila: ఎన్నికల్లో ఇచ్చిన హామీల అమలుపై మరోసారి సీఎం చంద్రబాబును కాంగ్రెస్ పార్టీ ఏపీ అధ్యక్షురాలు వైఎస్ షర్మిల నిలదీశారు. హామీలు ఇచ్చే సమయంలో ఆంధ్రప్రదేశ్ అప్పుల్లో ఉన్న విషయం తెలియదా? అని ప్రశ్నించారు. సూపర్ సిక్స్ అమలు చేయాల్సిందేనని డిమాండ్ చేశారు. 'ఏరు దాటే దాకా ఓడ మల్లన్న.. దాటాక బోడి మల్లన్న’ సామెతలాగా చంద్రబాబు తీరు ఉందని ఎద్దేవా చేశారు. సూపర్ సిక్స్‌లు అమలు చేయకుండా కుంటి సాకులు వెతుకుతున్నారని తెలిపారు.
Also Read: Muppa Raja: డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్ 'సస్పెండ్ ద లీడర్'.. ముప్పా రాజాపై వేటు
ఒక్క ఫించన్‌ల పెంపు మినహా సూపర్ సిక్స్ హామీలను చంద్రబాబు ప్రభుత్వం నెరవేర్చకపోవడంతో ఏపీసీసీ అధ్యక్షురాలు షర్మిల 'ఎక్స్' వేదికగా ప్రశ్నించారు. ఎన్నికల్లో సూపర్ సిక్స్ అంటూ ఆర్భాటం చేసిన చంద్రబాబు అమలుకు వచ్చేసరికి ఆదాయం పెరిగితేనే అంటూ మడతపేచి పెట్టారని మండిపడ్డారు. 'అప్పులు దొరకవని.. ఆదాయం పెంచుకోవాలని.. తలసరి ఆదాయం పెరగాలని.. మనుషులు మన ఆస్తి అంటూ వింత వింత మాటలు చెబుతున్నారు' అని ఆగ్రహం వ్యక్తం చేశారు. ఆడలేక మద్దెల దరువన్నట్లుంది చంద్రబాబు వ్యవహారం ఉందని చెప్పారు.
Also Read: Liquor Price Down: ఏపీ ప్రజలకు 'సంక్రాంతి కిక్కు'.. భారీగా మద్యం ధరలు తగ్గుముఖం
'ఎన్నికల్లో సూపర్ సిక్స్ హామీలు ఇచ్చే ముందు తెలియదా ఆంధ్రప్రదేశ్ రూ.10 లక్షల కోట్ల అప్పుల్లో ఉందని? తెలియదా? సూపర్ సిక్స్ హామీలు అమలు చేయాలంటే తెలియదా ఏటా రూ.2 లక్షల కోట్లు అవసరం ఉందని?' అని వైఎస్ షర్మిల ప్రశ్నలు సంధించారు. 'బడ్జెట్ మొత్తం డైవర్ట్ చేసినా ఇంకా నిధుల కొరత ఉంటుందని తెలియదా?' అని ప్రశ్నించారు. కేంద్రానికి మీరొక్కరే కాదని తెలిసినప్పుడు ఎందుకు మద్దతు ఇచ్చారు? అని నిలదీశారు. 'రాష్ట్రాన్ని సహాయపడనప్పుడు మోదీతో చెట్టాపట్టాలు దేనికోసం?' అని ఆగ్రహం వ్యక్తం చేశారు.
'ప్రజలు ఓట్లేసి అధికారం ఇస్తే.. ఏదో ఉద్ధరిస్తారని నమ్మకం పెట్టుకుంటే.. హామీలను తుంగలో తొక్కి.. విజన్ల పేరుతో .. వృద్ధి రేట్ల సాకుతో కాలయాపన తప్పా.. చంద్రబాబు పనితనం శూన్యం' అని వైఎస్ షర్మిల విమర్శలు చేశారు. 'ఎప్పటికైనా రాష్ట్రానికి సంజీవని ప్రత్యేక హోదా. హోదాతోనే రాష్ట్ర అభివృద్ధి' అని వివరించారు. 'నిధులు పారాలన్నా.. పరిశ్రమలు స్థాపన జరగాలన్నా.. ప్రజల ఆదాయం పెరగాలన్నా.. యువతకు ఉద్యోగాలు రావాలన్నా.. హోదా ఒక్కటే శరణ్యం' అని షర్మిల గుర్తుచేశారు.
స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.
ఆండ్రాయిడ్ లింక్ - https://bit.ly/3P3R74U
ఆపిల్ లింక్ - https://apple.co/3loQYe
Twitter, Facebook సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి.