Mithun Chakraborty - Padma Bhushan: మిథున్ చక్రబర్తి భారతీయ చిత్ర పరిశ్రమలో తొలి చిత్రంతోనే జాతీయ అవార్డును అందుకున్న తొలి హీరోగా రికార్డులకు ఎక్కారు. బెంగాలి సినిమా నుంచి తన ప్రస్థానం మొదలు పెట్టి.. బాలీవుడ్ అగ్ర హీరోగా కొన్నేళ్ల పాటు తన డాన్సులతో పాటు యాక్షన్ సినిమాలతో అలరించారు. ఈయన హీరో కావడం వెనక కూడా ఓ పెద్ద సినిమా కథనే ఉంది. సినిమా కష్టాలు.. సినిమా కష్టాలు అంటారుగా.. అలాగే తను హీరో కావడానికి ఎన్నో అడ్డంకులు ఎదుర్కొన్నారు. నిద్ర లేని రాత్రులు.. పుట్‌పాత్ పైనే పడుకున్న సందర్భాలున్నాయి. అంతేకాదు హీరో కావాలన్న తన కల నెరవేరదేమో అనుకొని ఒకానొక సందర్భంలో ఆత్మహత్య యత్నానికి పాల్పడ్డట్టు పలు సందర్భాల్లో మిథున్ చక్రబర్తి చెబుతూ ఉంటారు. మొత్తంగా మిథున్ చక్రబర్తి జీవితం వడ్డించిన విస్తరి కాదు. అంది వచ్చిన అవకాశాలను పుచ్చుకొని హీరోగా బాలీవుడ్ చిత్ర సీమలో చెలరేగిపోయారు.
ఈయన అసలు పేరు గౌరంగ చక్రబర్తి. ఆ తర్వాత మిథున్ చక్రబర్తిగా పేరు మార్చుకున్నాడు. ఈయన 1950 జూన్ 16 పశ్చిమ బంగా రాజధాని కోల్‌కతాలో జన్మించారు. సినిమాల్లో అవకాశాలు కోసం ఎన్నో కష్టాలు పడ్డ ఈయన 1976లో మృణాల్ సేన్ దర్శకత్వంలో తెరకెక్కిన 'మృగయ' చిత్రంలో హీరోగా తన కెరీర్ ప్రారంభించాడు. తొలి చిత్రంతోనే జాతీయ ఉత్తమ నటుడి అవార్డు అందుకొని సంచలనం రేపారు. ఆ తర్వాత ఈయన కెరీర్ అనుకున్నంతగా సాగలేదు. ఇక 1982లో విడుదలైన 'డిస్క్ డాన్సర్' సినిమాతో ఈయన కెరీర్ టర్న్ తీసుకుంది. ఈ సినిమాలోని ఈయన నటన, డాన్సింగ్ ఈయనకు ఎనలేని ఖ్యాతి తీసుకొచ్చింది.మొత్తంగా బాలీవుడ్‌లోనే కాదు.. మన దేశంలోనే తొలి డాన్సింగ్ సూపర్ స్టార్‌గా ఎదిగారు. అప్పట్లో చిరు సైతం ఆయన లా డాన్సులు చేయడం తన వల్ల కాదు అంటూ కామెంట్స్ చేసారు. డిస్కో డాన్సర్ మూవీ అప్పట్లో సోవియట్ యూనియన్‌లో ప్రదర్శితమైంది.
ఆ తర్వాత డాన్స్ డాన్స్, సురక్ష, హమ్ పాంచ్, సాహస్, వార్దాత్, శౌకీన్, వాంటెడ్, బాక్సర్, కసమ్ పైదా కర్నే వాలేకి, అవినాశ్,నసిహత్, వక్త్ కీ ఆవాజ్, ప్రేమ్ ప్రతిజ్క్ష, ముజ్రిమ్, అగ్నిపతథ్, రావణ్ రాజ్, జల్లాద్ వంటి చిత్రాలు ఈయనకు పేరు తీసుకొచ్చాయి. ఒకపుడు వరుస హిట్స్‌తో చెలరేగిపోయాయి. ఆ తర్వాత వరుస ఫ్లాపులు కూడా ఈయన్ని కలవర పెట్టాయి. హీరోగా ఫేడౌట్ అయ్యాక క్యారెక్టర్ ఆర్టిస్ట్‌గా, విలన్‌గా నటించారు. ఆపై కొన్ని టీవీ షోల్లో జడ్జ్‌గా వ్యవహరించారు. ఇక 2014లో ఈయన తృణముల్ కాంగ్రెస్‌తో రాజకీయ ఆరంగేట్రం చేసారు. అదే యేడాది మమతా బెనర్జీ.. మిథున్‌ను రాజ్యసభకు పంపించారు. ఆ తర్వాత 2016లో ఈయన పార్టీ సభ్యత్వానికి రాజ్యసభ సభ్యత్వానికి రాజీనామా చేసిన భారతీయ జనతా పార్టీలో చేరారు. ఇక జాతీయ ఉత్తమ నటుడిగా 'మృగయ'తో పాటు 'తానేదార్ కి కథ సినిమాలకు అవార్డులు అందుకున్నారు. అటు స్వామి వివేకనంద సినిమాలోని రామకృష్ణ పరమహంసగా నటించి బెస్ట్ సపోర్టింగ్ యాక్టర్‌గా జాతీయ అవార్డు అందుకోవడం విశేషం. ఈయన తెలుగు సినిమాలతో మంచి అనుబంధమే ఉంది. తెలుగులో వెంకటేష్, వపన్ కళ్యాణ్ హీరోలుగా నటించిన 'గోపాల గోపాల' సినిమాతో పాటు మలుపు సినిమాల్లో కీలక పాత్రలో నటించి ఇక్కడ ప్రేక్షకులను సైతం ఆకట్టుకున్నారు. ఏది ఏమైనా ఒకప్పటి సూపర్ స్టార్‌కు పద్మ భూషణ్ అవార్డుతో గౌరవించడంపై ఆయన అభిమానులు హర్షం వ్యక్తం చేస్తున్నారు.
Read: Ayodhya Crown: అయోధ్య రాముడికి స్వర్ణ కిరీటం.. వజ్రాలు, విలువైన రాళ్లు పొదిగినది ఎన్ని కోట్లు అంటే?
Also Read: BRS Party MLAS Meet Revanth: బీఆర్‌ఎస్ పార్టీలో కలకలం.. సీఎం రేవంత్‌ను కలిసిన నలుగురు ఎమ్మెల్యేలు
Android Link: https://play.google.com/store/apps/details?id=com.indiadotcom.zeetelugu
Apple Link: https://apps.apple.com/in/app/zee-telugu-news/id1633190712
మా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి Twitter , Facebook