Harish Rao KCR Birthday: 'కేసీఆర్ అంటే ఒక వ్యక్తి కాదు, ఒక నాయకుడు కాదు, నాలుగు కోట్ల ప్రజల భావోద్వేగం. కేసీఆర్ సహా తెలంగాణ వాదులు ఇష్టం ఉన్నా లేకున్నా ఆంధ్ర పాలకుల పార్టీల్లో పని చేశారు. కేసీఆర్ తెలుగుదేశంలో ఉన్నా తెలంగాణ ప్రయోజనాల కోసం ప్రశ్నిస్తూ వచ్చారు. అన్ని భరించారు. తెలంగాణ బాగు పడాలంటే రాష్ట్ర ఏర్పాటు తప్ప మరొక దారి లేదని బయటికి వచ్చారు' అని బీఆర్‌ఎస్ పార్టీ సీనియర్ నాయకులు, మాజీ మంత్రి హరీశ్ రావు తెలిపారు.
Also Read: KTR Letter To Nirmala: 'మిమ్మల్ని ప్రజలు క్షమించరు.. తెలంగాణ ముమ్మాటికి మిగులు రాష్ట్రమే!'
హైదరాబాద్‌లోని బీఆర్‌ఎస్ పార్టీ ప్రధాన కార్యాలయం తెలంగాణ భవన్‌లో సోమవారం కేసీఆర్ జన్మదిన వేడుకలు అంగరంగ వైభవంగా జరిగాయి. కేక్ కట్ చేసిన అనంతరం హరీశ్ రావు మాట్లాడుతూ కీలక వ్యాఖ్యలు చేశారు. ఈ సందర్భంగా కేసీఆర్‌తో తనకు ఉన్న అనుబంధం.. ఉద్యమ ఘడియలను గుర్తుచేసుకున్నారు. 'వందలు, వేల గంటల మేథోమదనం తర్వాత తెలంగాణ ఉద్యమానికి కేసీఆర్ శ్రీకారం చుట్టారు. ఎవరు జై తెలంగాణ అన్నా పదవి కోసమే అని నాడు అపవాదు ఉండేది. ఆ సమయంలో కేసీఆర్ జై తెలంగాణ నినాదాన్ని ప్రతిధ్వనించారు' అని హరీశ్ రావు తెలిపారు.
Also Read: Schools Holiday: ఈనెల 19న పాఠశాలలకు సెలవు.. ఎందుకంటే తెలుసా?
'అపవాదులను తొలగించడానికి మూడు పదవులను కేసీఆర్ గడ్డి పోచలుగా త్యజించి తెలంగాణ ప్రజల్లో నమ్మకం కల్పించారు. కేసీఆర్ మీద సంపూర్ణమైన విశ్వాసం ఉందని నాడు ప్రొఫెసర్ జయశంకర్ రావు అనేవారు. 2001 నుంచి కేసీఆర్‌తో పని చేసే అదృష్టం నాకు దొరికింది' అని మాజీ మంత్రి హరీశ్ రావు తెలిపారు. 'తెలంగాణ కోసం కేసీఆర్ ఎంతో శ్రమించారు. ఎన్నో బాధలు అనుభవించారు. ఉద్యమ సమయంలో వ్యక్తిత్వ హననానికి పాల్పడ్డారు. రకరకాలుగా బదునాం చేసేవారు' అని గుర్తుచేసుకున్నారు.
'మొండి ధైర్యంతో పోరాటం చేసి కేసీఆర్ తెలంగాణ ప్రజల ఆకాంక్షను నెరవేర్చాడు' అని సిద్దిపేట ఎమ్మెల్యే హరీశ్ రావు తెలిపారు. పదవులకు ఆశపడినా.. కుంగిపోయినా.. వెనక అడుగు వేసినా ఈరోజు మన తెలంగాణలో మనం ఉండే వాళ్లం కాదని హరీశ్ రావు వివరించారు. తెలంగాణ వచ్చిందంటే అది కేసీఆర్ మొండి పట్టుదల, పోరాటం వల్లేనని స్పష్టం చేశారు. 'గాంధీజీ సత్యాగ్రహం, పొట్టి శ్రీ రాములు ఆమరణ దీక్ష చూశాం. కేసీఆర్ ప్రాణ త్యాగానికి సిద్ధమై ఢిల్లీ పీఠాన్ని కదిలించారు. డిసెంబర్ 9, 2009 ప్రకటన వచ్చిందంటే కేసీఆర్ దీక్ష ఫలితం. ఆయన దీక్ష చేయకుంటే ఈనాడు తెలంగాణ ప్రకటన వచ్చేదా?' అని ప్రశ్నించారు.
'కొట్లాడి తెచ్చుకున్న తెలంగాణను కేసీఆర్ కన్నబిడ్డ లెక్క చూసుకున్నాడు. పదేండ్లలో కన్న బిడ్డ లాగా తెలంగాణను తీర్చిదిద్దారు. తాగు, సాగు నీరు, విద్యుత్... అన్ని రంగాల్లో తెలంగాణను అద్బుతంగా తీర్చిదిద్దారు. దేశానికి రోల్ మోడల్‌గా చేశారు' అని కేసీఆర్ పదేళ్ల పాలనను హరీశ్ రావు గుర్తుచేశారు. కేసీఆర్‌కు తెలంగాణకు ఉన్న బంధం తల్లిబిడ్డల బంధం.. పేగు బంధం అని పేర్కొన్నారు. ట్వంటీ ట్వంటీ మ్యాచ్‌లు ఆడుతున్న అని చెప్పే రేవంత్ ఆడేది తొండి మ్యాచులని విమర్శించారు. 'కేసీఆర్ టెస్టు, వన్ డే, 2020 ఏదైనా అద్బుతంగా ఆడుతాడు. ఎప్పుడు ఏది ఆడాల్నో కేసీఆర్ కు బాగా తెలుసు. అవసరమైతే డిఫెన్స్ అడుతాడు.. సిక్స్ లు కొడుతాడు. తెలంగాణ ప్రజలు ఏడికిపోయినా మళ్లీ కేసీఆర్ రావాలంటున్నారు' అని మాజీ మంత్రి హరీశ్ రావు తెలిపారు.
స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.
ఆండ్రాయిడ్ లింక్ - https://bit.ly/3P3R74U
ఆపిల్ లింక్ - https://apple.co/3loQYe
Twitter, Facebookసోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి.