ఆంధ్రప్రదేశ్‌కు ప్రత్యేక హోదా సాధన, రాష్ట్ర విభజన హామీల డిమాండ్లతో ఏప్రిల్ 6వ తేదీన సీపీఐ, సీపీఎంలతో కలిసి ఏపీలో పాదయాత్ర తలపెట్టనున్నట్టు జనసేన పార్టీ అధినేత పవన్‌కళ్యాణ్ ప్రకటించారు. విజయవాడలో బుధవారం సీపీఎం కార్యదర్శి పి.మధు, సీపీఐ కార్యదర్శి రామకృష్ణలతో కలిసి సమావేశమైన అనంతరం పవన్ కల్యాణ్ మీడియాతో మాట్లాడుతూ... ప్రత్యేక హోదా ఇవ్వకుండా బీజేపీ ఆంధ్రప్రదేశ్‌కు ద్రోహం చేస్తోంది అని అన్నారు. కేంద్రంపై అవిశ్వాస తీర్మానం ముందుకెళ్లకుండా జరుగుతున్న కుట్రను ఆంధ్రప్రదేశ్‌కు వ్యతిరేకంగా జరుగుతున్న కుట్రగా మేం భావిస్తున్నాం. నమ్మకద్రోహాన్ని, అప్రజాస్వామిక చర్యలను నిరసిస్తూ ఈ నెల 6వ తేదీన జాతీయ రహదారులపై, ఊరూరా ప్రధాన కూడళ్లలో పాదయాత్ర చేయనున్నాం'' అని తేల్చిచెప్పారు. విలేకరులు అడిగిన ఓ ప్రశ్నకు స్పందిస్తూ.. సీపీఎం, సీపీఐ కార్యదర్శులతో కలిసి తాను విజయవాడలో జరగనున్న పాదయాత్రలో పాల్గొననున్నట్టు ఈ సందర్భంగా పవన్ స్పష్టంచేశారు.
శాంతియుత పద్ధతిలోనే నిరసన చేపట్టనున్నప్పటికీ దాని ప్రభావం ఢిల్లీలో వున్న వాళ్లకు తెలిసొచ్చేలా వుంటుందన్న పవన్... పాదయాత్రల తర్వాత అనంతపురం, విజయనగరం, ఒంగోలులో మేధావులతో కలిసి చర్చావేదికలు నిర్వహించనున్నట్టు వివరించారు. ప్రత్యేక హోదా కోసం ఏపీ సీఎం చంద్రబాబు నాయుడు ఢిల్లీ వెళ్లడంపై పవన్ కల్యాణ్ స్పందిస్తూ.. రెండేళ్ల క్రితమే చేయాల్సిన పనిని చంద్రబాబు నాయుడు ఇప్పుడు చేస్తున్నారు అని ఎద్దేవా చేశారు. ప్రస్తుతం దేశ వ్యాప్తంగా చర్చనియాంశమైన ఎస్సీ, ఎస్టీ అత్యాచార నిరోధక చట్టం వివాదం గురించి ప్రస్తావిస్తూ... ఎస్సీ, ఎస్టీ అత్యాచార నిరోధక చట్టాన్ని బలహీన పరచేందుకు జరిగే కుట్రలను జనసేన, సీపీఐ, సీపీఎంలు తీవ్రంగా పరిగణిస్తున్నాయని... దళితులు తమ హక్కుల సాధన కోసం సాగిస్తున్న పోరాటంలో వారికి తాము పూర్తి అండగా నిలుస్తామని ప్రకటించారు.