టాలీవుడ్ సూపర్ స్టార్ మహేష్ బాబు బాలీవుడ్‌లోకి ఎంట్రీ ఇవ్వనున్నాడా అంటే అవుననే అంటున్నాయి టాలీవుడ్ వర్గాలు. సూపర్ స్టార్ బాలీవుడ్ ఎంట్రీ ఇవ్వబోతున్నాడనేది ఇవాళ కొత్తగా వినిపిస్తున్న చర్చేమీ కాదు కాకపోతే దీనిపై గతంలో ఎప్పుడూ మహేష్ బాబు నుంచి సరైన స్పందన మాత్రం లభించలేదు. అయితే, ఇటీవల ఓ ఇంటర్వ్యూలో పాల్గొన్న సందర్భంగా మహేష్ బాబుని బాలీవుడ్ ఎంట్రీపై స్పందించాల్సింది కోరగా.. మంచి స్క్రిప్ట్ లభిస్తే, తాను బాలీవుడ్ సినిమా చేయడానికి వెనుకాడనని చెప్పినట్టు తెలుస్తోంది. అందువల్లే మహేష్ బాబు హిందీ సినిమాపై మరోసారి ఆసక్తికరమైన చర్చలు జరుగుతున్నాయి.
తాజాగా టాలీవుడ్ మీడియాలో వినిపిస్తున్న కథనాల ప్రకారం ఇటీవల తన భార్య నమ్రతా శిరోద్కర్, పిల్లలు గౌతం, సితారలతో కలిసి విదేశీ పర్యటనకు వెళ్లిన మహేష్ బాబు తిరిగి వచ్చే క్రమంలో నేరుగా ముంబైకి వెళ్లారని, అక్కడే బాలీవుడ్ ఎంట్రీపై చర్చలు జరిగాయనే టాక్ వినిపిస్తోంది. తెలుగు, తమిళ భాషల్లో తెరకెక్కిన స్పైడర్ సినిమాను హిందీలో రీమేక్ చేయాలని ఆ చిత్ర దర్శకుడు ఏ.ఆర్. మురుగదాస్ ఆసక్తి కనబరుస్తున్నాడని, స్పైడర్ హిందీ రీమేక్‌లో మహేష్ బాబునే హీరోగా చేయనున్నాడనేది ఆ టాక్ సారాంశం.
తెలుగు, తమిళ భాషల్లో పెద్దగా హిట్ కాని ఈ సినిమానే మళ్లీ బాలీవుడ్ ఎంట్రీకి ఎంచుకోవడం సరైన నిర్ణయమేనా అని సందేహం వ్యక్తంచేస్తోన్న వాళ్లూ లేకపోలేదు. అయితే, సినీవర్గాల్లో జరుగుతున్న ఈ ప్రచారంపై ఇప్పటివరకు ఏ ఒక్కరూ అధికారికంగా స్పందించకపోవడం గమనార్హం.