అర్ధరాత్రి చోటుచేసుకున్న ఓ అగ్ని ప్రమాదం 14 మందిని పొట్టన పెట్టుకోగా మరో 14 మందిని ఆస్పత్రిపాలుచేసింది. ముంబైలోని లోయర్ పరేల్‌లో వున్న కమల మిల్స్‌లో సంభవించిన అగ్ని ప్రమాదం అక్కడి పరిసరవాసులకి ఊపిరాడకుండా చేసింది. తొలుత అగ్ని ప్రమాదం గురించి సమాచారం అందుకుని అక్కడికి చేరుకున్న ఫైర్ సిబ్బంది, బృహత్ ముంబై కార్పొరేషన్ అధికారులు అదృష్టవషాత్తుగా ఎటువంటి ప్రాణ నష్టం జరగలేదని అన్నారు. అయితే, ప్రమాదం సంభవించిన కొన్ని గంటల తర్వాత పరిస్థితి పూర్తిగా మారిపోయింది. కమల మిల్స్ భారీ అగ్ని ప్రమాదం కారణంగా ఊపిరాడకపోవడంతో కొంతమంది మృతిచెందగా ఇంకొంతమంది అస్వస్థతకుగురై ఆస్పత్రిపాలయ్యారు.
కమల మిల్స్ అగ్ని ప్రమాదంలో మృతిచెందిన వారి సంఖ్య 14కి చేరగా, కేఈఎం ఆస్పత్రిలో మరో 14 మంది చికిత్స పొందుతున్నారు. కేఈఎం ఆస్పత్రిలో చికిత్స పొందుతున్న వారి ప్రాణాలకి ఎటువంటి ముప్పు లేదని ఆస్పత్రి డీన్ అన్వేష్ సూపె తెలిపారు. అగ్ని ప్రమాదానికి కారణమైన 1 ఎబోవ్ రెస్టారెంట్‌పై ఐపీసీ సెక్షన్ 304 కింద కేసు నమోదు చేసి దర్యాప్తు ప్రారంభించినట్టు లోయర్ పరేల్ పోలీసులు మీడియాకు తెలిపారు. పోలీసులు వెల్లడించిన వివరాల ప్రకారం 1 ఎబోవ్ రెస్టారెంట్‌లో చెలరేగిన మంటలు కమల మిల్స్ వరకు వ్యాపించాయని తెలుస్తోంది.