నటీనటులు: నయనతార, విగ్నేష్, రమేష్, సును లక్ష్మి, వినోదిని వైద్యనాథన్, రామచంద్రన్ దురైరాజ్, ఆనంద్ కృష్ణన్
కెమెరా : ఓం ప్రకాష్
మ్యూజిక్ : జిబ్రాన్
ఎడిటింగ్ : గోపీకృష్ణ
కథ దర్శకత్యం : గోపీ నైనర్
నిర్మాతలు : శరత్ మరార్, ఆర్.రవీంద్రన్
రిలీజ్ డేట్ : 16 మార్చ్ 2018
నయనతార ప్రధాన పాత్రలో తమిళ్ లో సూపర్ హిట్ గా నిలిచిన ‘అరమ్’ తెలుగులో ‘కర్తవ్యం’ టైటిల్ తో విడుదలైంది. సోషల్ పొలిటికల్ డ్రామాగా తెరకెక్కిన ఈ సినిమా తెలుగు ప్రేక్షకులను కూడా ఆకట్టుకొని విజయం సాధించిందో లేదో చూద్దాం
కథ :
మధువర్షిణి(నయనతార) ఓ ఐఏఎస్ ఆఫీసర్. ఈమె కలెక్టర్ గా పనిచేసే జిల్లాలో వేనీడు అనే గ్రామంలో తాగునీరు కోసం అల్లాడుతున్న ప్రజలు. ఆ ప్రజల కష్టాలను తీర్చడానికి ప్రభుత్వానికి సైతం ఎదురెళ్తుంది మధువర్షిణి. ఆ ఊళ్లో బుల్లబ్బాయి (రామచంద్రన్ దురైరాజ్), సుమతి(సునులక్ష్మి) కూలిపని చేస్తూ జీవనం కొనసాగిస్తుంటారు. వాళ్లకు ఇద్దరు పిల్లలు. అయితే ఓ రోజు సుమతి కూలి పనికి వెళ్ళినప్పుడు ఆమె కూతురు ధన్షిక(మహాలక్ష్మి) ఆడుకుంటూ వెళ్లి పక్క పొలంలో మూయకుండా వదిలేసిన బోరుబావిలో పడుతుంది. ఆ విషయం తెలుసుకున్న కలెక్టర్ మధువర్షిణికి ఆ పాపని కాపాడడం తన కర్తవ్యంగా భావించి ప్రభుత్వంతో ఎలా ఫైట్ చేస్తుంది. చివరికి ఓ కలెక్టర్ గా ఆ పాప ప్రాణాలను కాపాడగలిగిందా.? లేదా అనేది మిగతా కథ.
నటీనటుల పనితీరు:
నిజానికి నయనతారకి ఇలాంటి పాత్రలు కొత్తేం కాదు. ఇప్పటికీ ఎన్నో లేడీ ఓరియంటెడ్ సినిమాల్లో నటించిన అనుభవంతో మరోసారి జిల్లా కలెక్టర్ రోల్ కి పర్ఫెక్ట్ అనిపించుకుంది. తన పెర్ఫార్మెన్స్ తో సినిమాకు మెయిన్ హైలైట్ గా నిలిచింది. బేబి మహాలక్ష్మి పాత్రలో దన్సిక ఒదిగిపోయి నటించింది. ఆమె యాక్టింగ్ అందరితో శభాష్ అనిపించుకుంటుంది. కూతురు బోరు బావిలో పడినప్పుడు వారి తల్లి తండ్రి ఎంత వేదన పడతారో తమ నటనతో చూపించి ఆకట్టుకున్నారు రామచంద్రన్ దురైరాజ్, సున్ను లక్ష్మి. ముత్తు క్యారెక్టర్ లో మాస్టర్ రమేష్ బాగా నటించాడు. ఇక వెళ రామమూర్తి, విగ్నేష్, వినోదిని వైద్యనాథన్, ఆనంద్ కృష్ణన్, రామదాసు, కిట్టి, జీవ రవి తదితరులు తమ క్యారెక్టర్స్ ని పండించారు.
టెక్నిషియన్స్ పనితీరు :
ఇలాంటి సోషల్ డ్రామా సినిమాలకు బ్యాక్ గ్రౌండ్ స్కోర్ చాలా ముఖ్యం… కొన్ని ఎమోషనల్ సీన్స్ లో తన బ్యాక్ గ్రౌండ్స్కోర్ తో మంచి ఇంపాక్ట్ తీసుకొచ్చి సినిమాకు హైలైట్ గా నిలిచాడు జిబ్రాన్. ఓం ప్రకాష్ సినిమాటోగ్రఫీ బాగుంది. ఎడిటింగ్ పరవాలేదు. కొన్ని సందర్భాలలో వచ్చే ఎమోషనల్ డైలాగ్స్ బాగా ఆకట్టుకున్నాయి. కథను తను అనుకున్న విధంగా అద్భుతంగా తెరకెక్కించి స్క్రీన్ ప్లేతో కట్టిపడేసాడు గోపి నైనర్. ప్రొడక్షన్ వాల్యూస్ పరవాలేదు.
సమీక్ష :
నమ్మిన కథను ప్రేక్షకుల వరకు చేరవేయడం ఎంతో కష్టమైన పని. అందులోకి సోషల్ పొలిటికల్ డ్రామా సినిమాను అందరికీ కనెక్ట్ అయ్యేలా తీయడం మరీ కష్టం. ఎంతో ఆసక్తికరంగా ఉంటేనే తప్ప సినిమాలు ప్రేక్షకులను అలరించవు. ఓ బోరు బావిలో పడి ప్రాణాలతో కొట్టుమిట్టాడే చిన్నారి ఘోషను కళ్ళకు కట్టినట్టు చూపించి తన స్క్రీన్ ప్లే తో ఆకట్టుకొని దర్శకుడిగా తన కర్తవ్యాన్ని అద్భుతంగా నిర్వర్తించాడు గోపి నైనర్.. కొన్ని సందర్భాల్లో గుండెల్ని పిండేసి మనసుల్ని కదిలించాడు.
ఇక దర్శకుడు నమ్మిన కథను తను కూడా ఛాలెంజింగ్ గా తీసుకొని కలెక్టర్ పాత్రలో ఒదిగిపోయి నటించిన నయనతారని ప్రత్యేకంగా అభినందించాలి. ముఖ్యంగా చిన్నారులు బోరు బావిలో పడినప్పుడు అక్కడ పరిస్థితులను.. ప్రభుత్వ నిర్లక్షతను, రాజకీయ నాయకుల స్వార్ధాన్ని, ఆ సందర్భంలో జిల్లా కలెక్టర్ పనితీరుని కళ్ళకు కట్టినట్టు చూపించి ఎమోషనల్ గా కనెక్ట్ చేయగలిగాడు దర్శకుడు.
బోరుబావిలో పడిన పాప చుట్టూ అల్లిన ఎమోషనల్ సన్నివేశాలు బాగున్నాయి. పాత్రలకు తగిన నటీనటులను ఎంచుకొని అక్కడే మొదటి విజయం అందుకున్నాడు దర్శకుడు. ప్రారంభం నుండి ప్రీ ఇంటర్వెల్ వరకూ కూడా సినిమా సాదా సీదాగా అనిపిస్తుంది. కాని ప్రీ ఇంటర్వెల్ నుండి ప్రేక్షకుడిలో సినిమాపై ఆసక్తి కలిగించి ఎమోషన్ తో కట్టిపడేశాడు దర్శకుడు. అంతరిక్షంలోకి వెళ్ళేవాడి కన్నా, అధఃపాతాళంలోకి వెళ్లే సాహసం చేసేవాడే గొప్పవాడు అంటూ క్లైమాక్స్ లో దర్శకుడు చెప్పిన తీరు అందరినీ ఆకట్టుకుంటుంది. ముఖ్యంగా కొన్ని సన్నివేశాలతో ఎమోషనల్ గా కనెక్ట్ చేస్తూనే ఆలోచింపజేశాడు గోపి. నయనతార క్యారెక్టర్, పెర్ఫార్మెన్స్ సందర్భానుసారంగా వచ్చే పాటలు, ఎమోషనల్ సీన్స్, ఆసక్తికరంగా సాగే క్లైమాక్స్ సినిమాకు హైలైట్ గా నిలిచాయి. ఫైనల్ గా ‘కర్తవ్యం’ ఎమోషనల్ డ్రామాగా ఆకట్టుకుంటుంది.
రేటింగ్ : 2.75 /5