Nandamuri Balakrishna tributes to Sirivennela: తన పాటలతో ఎన్నో హృదయాలను కదలించిన సినీ సాహితీ శిఖరం సిరివెన్నెల సీతారామశాస్త్రి (Sirivennela Seetharamashastry)... ఈ లోకాన్ని వీడి తెలుగు హృదయాలను శోకసంద్రంలో ముంచేశారు. ఆయన మరణంతో అటు అభిమానులు, ఇటు చిత్రపరిశ్రమలోని నటీనటులు కంటతడి పెట్టుకుంటున్నారు. బుధవారం (డిసెంబర్ 1) ఉదయం సిరివెన్నెల పార్థివ దేహాన్ని సందర్శించిన హీరో నందమూరి బాలకృష్ణ (Nandamuri Balakrishna) భావోద్వేగానికి గురయ్యారు. సిరివెన్నెల గురించి మాట్లాడుతూ ఆయన కంటతడి పెట్టుకున్నారు.
'ఇది ఒక నమ్మలేని నిజం... ఏం మాట్లాడాలో తెలియట్లేదు. తెలుగు భాష, సాహిత్యానికి సిరివెన్నెల ఒక భూషణుడు. ఎవరైతే కుటుంబానికి, పుట్టిన ఊరికి, జాతికి కీర్తి ప్రతిష్ఠలు తీసుకొస్తారో... వాళ్లు ఉన్నా లేకున్నా శాశ్వతంగా మిగిలిపోతారు. సిరివెన్నెల 1984లో కళాతపస్వీ దర్శకత్వంలో నేను నటించిన 'జననీ జన్మభూమి' సినిమాతో పాటల ప్రస్థానాన్ని మొదలుపెట్టారు. నా సినిమాతో ఆయన ఆరంగేట్రం చేయడం నా పూర్వజన్మ సుకృతం. సిరివెన్నెల సినిమాతో ఆయన ఎప్పటికీ నిలిచిపోయే అద్భుత సాహిత్యం అందించారు. ఇవాళ ఆయన చలన చిత్ర పరిశ్రమను, అభిమానులను శోకసంద్రంలో ముంచారు.' అని నందమూరి బాలకృష్ణ భావోద్వేగానికి (Nandamuri Balakrishna gets emotional) గురై కంటతడి పెట్టుకున్నారు.
'ఆయన్ను ఎప్పుడు ఎక్కడ కలుసుకున్నా చలాకీగా మాట్లాడేవారు. ఎప్పుడు కలిసినా సాహిత్యం గురించి మాట్లాడుకునేవాళ్లుం. ఆయన నుంచి నేను చాలా స్పూర్తిని పొందాను. దాదాపు 3వేల పాటలు రాయడమంటే మామూలు విషయం కాదు. ఆయన పాటలు కొన్ని చందమామ వెన్నెల అయితే, మరికొన్ని సూర్యుడి లాంటి విప్లవాత్మక గేయాలు. 11 సార్లు నంది అవార్డులు అందుకున్నారు. 2019లో పద్మశ్రీ అవార్డుతో కేంద్రం ఆయన్ను గౌరవించింది. ఆయన స్థాయికి ఎవరూ ఎదగలేదు... ఆయన స్థానాన్ని ఎవరూ భర్తీ చేయలేరు. కళామతల్లికి ఆయన ఇంకెంతో సేవను అందించాల్సి ఉంది. కానీ ఇంతలోనే ఆయన వెళ్లిపోవడం బాధాకరం. ఆయన ఆత్మ శాంతించాలి. కుటుంబ సభ్యులకు ప్రగాఢ సానుభూతి.' అని బాలకృష్ణ (Nandamuri Balakrishna) పేర్కొన్నారు.
Also Read: Sirivennela Seetharama Sastry : సిరివెన్నెల చనిపోవడానికి కారణాలివే
ప్రస్తుతం ఫిలిం ఛాంబర్ వద్ద ఉన్న సిరివెన్నెల (Sirivennela Seetharamashastry) పార్థివ దేహానికి నివాళులు అర్పించడానికి సినీ ప్రముఖులు తరలివస్తున్నారు. ఇప్పటికే విక్టరీ వెంకటేష్, సాయికుమార్, త్రివిక్రమ్ తనికెళ్ల భరణి, మణిశర్మ, టీఎస్ఆర్టీసీ ఎండీ సజ్జనార్ తదితరులు సిరివెన్నెలకు నివాళులర్పించారు. ఈ సాయంత్రం ఫిలిం నగర్ మహాప్రస్థానంలో సిరివెన్నెల అంత్యక్రియలు జరగనున్నాయి.