Gujarat High Court: గుజరాత్ హైకోర్టు నిన్న మంగళవారం ఇచ్చిన తీర్పు సంచలం రేపుతోంది. ముస్లింల నమాజ్ పిలుపుగా భావించే అజాన్‌కు వ్యతిరేకంగా దాఖలైన పిల్‌ను హైకోర్టు కొట్టివేసింది. ఈ సందర్బంగా హైకోర్టు ధర్మాసనం చేసిన వ్యాఖ్యలు ఆలోచింపజేస్తున్నాయి.
అజాన్ అనేది ముస్లింలకు నమాజ్‌కు రమ్మని ఇచ్చే పిలుపు. ప్రతి మసీదు నుంచి రోజుకు ఐదు సార్లు ఈ పిలుపు విన్పిస్తుంటుంది. ఈ అజాన్‌కు వ్యతిరేకంగా దాఖలైన పిల్‌పై విచారణ జరిపిన గుజరాత్ హైకోర్టు సంచలన వ్యాఖ్యలు చేసింది. మసీదుల్లో లౌడ్ స్పీకర్ల నుంచి రోజుకు ఐదుసార్లు వచ్చే అజాన్ అనేది ఎలాంటి శబ్ద కాలుష్యం చేయడని గుజరాత్ హైకోర్టు తెలిపింది. అజాన్ లౌడ్ స్పీకర్లలో ఇవ్వకుండా నిషేధించాలంటూ దాఖలైన పిల్‌ను హైకోర్టు కొట్టిపారేసింది. గుజరాత్ హైకోర్టు ఛీఫ్ జస్టిస్ సునీతా అగర్వాల్, జస్టిస్ అనిరుద్ధ మయీ నేతృత్వంలోని డివిజన్ బెంచ్ ఈ పిల్‌ను విచారించింది. లౌడ్ స్పీకర్ ద్వారా వచ్చే ఓ మనిషి గొంతు ఏ విధంగా శబ్దకాలుష్యం కల్గించే డెసిబుల్స్ దాటి ఉంటుందో చెప్పడంలో పిటీషనర్ విఫలమయ్యాడని డివిజన్ బెంచ్ తెలిపింది.
మసీదుల్లో అజాన్‌కు లౌడ్ స్పీకర్లపై నిషేధం విధించాలంటూ ధర్మేంద్ర ప్రజాపతి అనే ఓ వైద్యుడు ఈ పిల్ దాఖలు చేశాడు. మసీదుల్లో లౌడ్ స్పీకర్ల వల్ల డిస్ట్రబెన్స్, శబ్ద కాలుష్యం కలుగుతోందని ఆరోపించాడు. ఏ ప్రాతిపదికన పిటీషనర్ శబ్ద కాలుష్యమైందని భావిస్తున్నాడో చెప్పాలని డివిజన్ బెంచ్ కోరింది. మీరు మ్యూజిక్ ప్లే చేస్తుంటారు అది డిస్ట్రబెన్స్ కాదా అని గుజరాత్ ఛీఫ్ జస్టిస్ ప్రశ్నించారు. దీనికి సమాధానంగా మ్యూజిక్ ఇంట్లోనే ప్లే చేస్తామని పబ్లిక్ ప్లేస్‌లో కాదని పిటీషనర్ తరపు న్యాయవాది తెలిపారు.
అయితే గుజరాత్ హైకోర్టు ఛీఫ్ జస్టిస్ దీనికి గట్టి కౌంటర్ ఇచ్చారు. మే అడిగేది ఇంట్లో ప్లే చేసే మ్యూజిక్ గురించి కాదు. భజన, హారతి ఇచ్చేటప్పుడు దేవాలయాల్లో మీరు కూడా లౌడ్ స్పీకర్లతో మ్యూజిక్ ప్లే చేస్తుంటారు కదా అది డిస్ట్రబెన్స్ కలిగించదా, అజాన్ ఎలా ఇబ్బంది కల్గిస్తుంది మరి, అది కూడా మొత్తం రోజంతా కలిపి 10 నిమిషాలు కూడా ఉండని అజాన్ ఎలా డిస్ట్రెబెన్స్ అవుతుందని ప్రశ్నించారు. అజాన్ ఇచ్చేటప్పుడు ఎన్ని డెసిబుల్స్ ధ్వని దాటుతుందో లెక్కగట్టారా అని అడిగారు. పెద్దఎత్తున శబ్ద కాలుష్యం చేసే డీజే పరిస్థితి ఏంటని ప్రశ్నించారు ఛీఫ్ జస్టిస్ అగర్వాల్. ఇలాంటి పిల్స్ మేం ఎంటర్‌టైన్ చేయం. అజాన్ అనేది ఏళ్ల తరబడి కొనసాగుతున్న ఓ విశ్వాసం. అది కూడా రోజంతా కలిపి 10 నిమిషాలు కూడా ఉండదని ఛీఫ్ జస్టిస్ వ్యాఖ్యానించారు.
అయితే పిటీషనర్ తరపు న్యాయవాది తన వాదన ఇంకా కొనసాగించారు. అజాన్ రోజుకు ఐదుసార్లు ఉంటుందని హారతి ఒకసారే అని వివరణ ఇచ్చే ప్రయత్నం చేశారు. అయితే రోజూ తెల్లవారుజామునే మీ దేవాలయాల్లో డ్రమ్స్, మ్యూజిక్ తో హారతి ప్రారంభమైతే అది ఎవరికీ ఎలాంటి డిస్ట్రబెన్స్ కల్గించదా, గుడిలో గంటలు ఇతరత్రా శబ్దాలు గుడి తప్ప బయట విన్పించవని చెప్పగలరా అని ఛీఫ్ జస్టిస్ ప్రశ్నించారు. నాయిస్ పొల్యూషన్ లేదా శబ్ద కాలుష్యాన్ని డెసిబుల్స్‌లో కొలుస్తారు. రోజుకు పది నిమిషాల అజాన్‌లో ఎన్ని డెసిబుల్స్ దాటుతున్నాయి, ఎంత నాయిస్ క్రియేట్ చేస్తోంది, ఇలా శాస్త్రీయంగా అజాన్‌కు వ్యతిరేకంగా వాదిస్తారా అని అడిగారు. కానీ శాస్త్రీయంగా వాదించకుండా ఆరోపణలు చేయడం మంచిది కాదని కోర్టు హితవు పలికింది.
నిర్ణీత ఏరియాలో అజాన్ సమయంలో ఎంత డెసిబుల్స్ కాలుష్యం ఉందనేది పిటీషనర్ నిరూపించలేకపోయాడని కోర్టు భావించింది. కేవలం వివిధ సామాజిక, మతపరమైన ప్రజలుండే ప్రాంతంలో లౌడ్ స్పీకర్లతో వచ్చే అజాన్ తమకేదో ఇబ్బంది కల్గించేస్తుందని భావించి మాత్రమే పిటీషనర్ పిల్ దాఖలు చేసినట్టుగా కోర్టు అభిప్రాయపడింది. శాస్త్రీయత లేకుండా, ఎంత డెసిబుల్స్ ధ్వని కాలుష్యం అవుతుందో తేల్చకుండా రోజుకు 10 నిమిషాలు కూడా ఉండని ఆజాన్‌కు వ్యతిరేకంగా పిల్ వేయడం సముచితం కాదని తెలిపింది. ఈ పిల్‌లో ఏ విధమైన మెరిట్ కన్పించనందున కొట్టివేస్తున్నట్టు గుజరాత్ హైకోర్టు తెలిపింది.
Also read: Maruti Suzuki Swift 2024: కొత్త మారుతి స్విఫ్ట్ 2024పై స్పష్టత, డిజైన్, పీచర్లు ఎలా ఉంటాయంటే
స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.
Android Link - https://play.google.com/store/apps/details?id=com.indiadotcom.zeetelugu
Apple Link - https://apps.apple.com/in/app/zee-telugu-news/id1633190712
మా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి Twitter , Facebook