ETELA Rajender: ఈటల రాజేందర్ అర్జునుడా.. అభిమన్యుడా! మునుగోడులో మేజిక్ చేస్తారా?

ETELA Rajender:అధికార పార్టీ సర్వశక్తులు ఒడ్డినా... హుజురాబాద్ లో ఘన విజయం సాధించి తనకు తిరుగులేదని నిరూపించుకున్నారు ఈటల రాజేందర్.హుజురాబాద్ గెలుపు తర్వాత బీజేపీలో ఈటల రాజేందర్ గ్రాఫ్ మరింత పెరిగింది. బీజేపీ పెద్దలు ఆయనకు ఎక్కువ ప్రాధాన్యత ఇచ్చారు. హైదరాబాద్ లో జరిగిన బీజేపీ జాతీయ కార్యవర్గ సమావేశాల్లో ఈటల రాజేందర్ తో ప్రత్యేకంగా మాట్లాడించారు.

Written by - Srisailam | Last Updated : Oct 23, 2022, 05:05 PM IST
  • బీజేపీ నుంచి పెరిగిన వలసలు
  • ఈటల రాజేందర్ విఫలమయ్యారా?
  • బూరను పార్టీలో చేర్పించిన సంజయ్
ETELA Rajender: ఈటల రాజేందర్ అర్జునుడా.. అభిమన్యుడా! మునుగోడులో మేజిక్ చేస్తారా?

ETELA Rajender: ఈటల రాజేందర్.. తెలంగాణ రాజకీయాల్లో ఆయనో సంచలనం. ప్రత్యేక రాష్ట్ర ఉద్యమంలో కీలక పాత్ర పోషించిన ఈటల.. సీఎం కేసీఆర్ కు అత్యంత సన్నిహితుల్లో ఒకరు. టీఆర్ఎస్ లో టాప్ త్రీగా ఆయనను చెప్పుకునేవారు. కేసీఆర్ తొలి కేబినెట్ లో కీలకమైన ఆర్థికశాఖను నిర్వహించారు. రెండో సారి టీఆర్ఎస్ అధికారంలోకి వచ్చేసరికి సీన్ మారింది. కేసీఆర్, రాజేందర్ మధ్య గ్యాప్ పెరిగింది. అది మంత్రివర్గం నుంచి ఈటలను భర్తరఫ్ చేసే వరకు వెళ్లింది. తనను కేబినెట్ నుంచి తప్పించడంతో కేసీఆర్ ను టార్గెట్ చేశారు ఈటల రాజేందర్. గులాబీబాస్ ను గద్దే దించడమే తన లక్ష్యమని చెప్పారు. ఎమ్మెల్యే పదవికి రాజీనామా చేసి కేసీఆర్ కు సవాల్ విసిరారు. అధికార పార్టీ సర్వశక్తులు ఒడ్డినా... హుజురాబాద్ లో ఘన విజయం సాధించి తనకు తిరుగులేదని నిరూపించుకున్నారు ఈటల రాజేందర్.

హుజురాబాద్ గెలుపు తర్వాత బీజేపీలో ఈటల రాజేందర్ గ్రాఫ్ మరింత పెరిగింది. బీజేపీ పెద్దలు ఆయనకు ఎక్కువ ప్రాధాన్యత ఇచ్చారు. హైదరాబాద్ లో జరిగిన బీజేపీ జాతీయ కార్యవర్గ సమావేశాల్లో ఈటల రాజేందర్ తో ప్రత్యేకంగా మాట్లాడించారు. తెలంగాణలో వచ్చే ఎన్నికల్లో అధికారమే లక్ష్యంగా పావులు కదుపుతున్న బీజేపీ.. అధికార పార్టీతో పాటు కాంగ్రెస్ లోని బలమైన నేతలకు వల వేసే పనిలో పడింది. ఆ టాస్క్ ను ఈటల రాజేందర్ కు అప్పగించింది. తెలంగాణలో చేరికల కమిటి బాధ్యతలు అప్పగించింది. హైకమాండ్ నుంచి పూర్తి మద్దతు ఉండటంతో ఇతర పార్టీల నుంచి బీజేపీలోకి భారీగా చేరికలు ఉండేలా రాజేందర్ మంత్రాంగం నడిపించారు. మాజీ ఎంపీ కొండా విశ్వేశ్వర్ రెడ్డితో పాటు మరికొందరు నేతలు కమలం గూటికి చేరారు. కాని తర్వాత కాలంలో సీన్ మారింది. తమ పార్టీలోకి భారీగా చేరికలు ఉంటాయని బీజేపీ అగ్ర నేతలు పదేపదే చెబుతున్నా..  అలాంటి పరిస్థితులు కనిపించ లేదు.

బీజేపీలో చేరికలు తగ్గగా.. ఆ పార్టీ నుంచి వలసలు పెరిగిపోయాయి. భువనగిరి మాజీ ఎంపీ బూర నర్సయ్య గౌడ్ బీజేపీలో చేరారు. అయితే బూర చేరిక కార్యక్రమం మొత్తం బండి సంజయ్ డైరెక్షన్ లోనే సాగిందని తెలుస్తోంది.
బూర చేరిక విషయం కూడా జాయినింగ్ కమిటీ చైర్మన్ ఈటల రాజేందర్ కు తెలియదని తెలుస్తోంది.బూర చేరిక తర్వాత కేసీఆర్ ఆపరేషన్ తో పలువురు కీలక నేతలు కమలం పార్టీకి రాజీనామా చేసి కారెక్కేశారు. శాసనమండలి మాజీ చైర్మెన్ స్వామి గౌడ్, దాసోజు శ్రవణ్ కుమార్, మాజీ ఎమ్మెల్యే బిక్షమయ్య గౌడ్ గులాబీ గూటికి చేరారు. త్వరలో మరికొందరు నేతలు బీజేపీని వీడి కారెక్కుతారనే ప్రచారం సాగుతోంది. తాజాగా జరుగుతున్న పరిణామాలతో ఈటల విషయంలో బీజేపీ పెద్దల ఆలోచన మారిందనే ప్రచారం సాగుతోంది. కొత్తగా చేరికలు లేకపోగా.. ఉన్న నేతలు పోతున్నా ఎందుకు ఆపడం లేదంటూ  జాయినింగ్ కమిటీ చైర్మన్ గా ఉన్న ఈటల రాజేందర్ పై హైకమాండ్ తీవ్ర ఆగ్రహంగా ఉన్నట్లు సమాచారం. ఇతర పార్టీల నేతలను బీజపీ వైపు ఆకర్షించడంలో ఈటల విఫలమయ్యారని కొందరు కమలం నేతలు ఓపెన్ గానే చెబుతున్నారు.

మరోవైపు ఈటల రాజేందర్ వర్గీయులు మాత్రం మరో వాదన చేస్తున్నారు. పార్టీలో ఈటలకు వ్యతిరేకంగా మరో వర్గం పని చేస్తుందని ఆరోపిస్తున్నారు. బండి సంజయ్ వర్గంగా చెప్పుకుంటున్న నేతలు.. కావాలనే ఈటలను కార్నర్  చేస్తున్నారని అంటున్నారు. మునుగోడులో రాజగోపాల్ రెడ్డి విజయం కోసం శ్రమిస్తున్న రాజేందర్ ను డిస్ట్రబ్ చేసేలా కొన్ని పరిణామాలు జరుగుతున్నాయని చెబుతున్నారు. రాజగోపాల్ రెడ్డి గెలిస్తే ఈటల గ్రాఫ్ మరింత పెరిగుతుందన్న భయంతోనే కొందరు నేతలు ఇలా చేస్తున్నారని.. ఎవరెన్ని కుట్రలు చేసినా ఈటల రాజేందర్ అర్జునుడిగా విజేతగా నిలుస్తారని ఆయన అభిమానులు చెబుతున్నారు. 

Read Also: Munugode Bypoll:  పాల్వాయి స్రవంతి కాన్వాయ్ పై దాడి.. మునుగోడులో తీవ్ర ఉద్రిక్తత

Read Also: Hero Akhil Raj: బీచ్లో కొట్టుకుపోయిన యువహీరో.. చావు తప్పి కన్నులొట్ట బోయి!

స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.  

Android Link https://bit.ly/3P3R74U

Apple Link - https://apple.co/3loQYe 

మా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి Twitter , Facebook

Trending News